
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికా టీనేజర్ కొకొ గాఫ్, ట్యునీసియా స్టార్ అన్స్ జబెర్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో మెగా టోర్నీలో ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. సోమవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ గాఫ్ 7–5, 6–2తో అనా కరోలినా ష్మిడ్లోవా (స్లొవేకియా)ను వరుస సెట్లలో ఓడించింది. దాంతో ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది క్వార్టర్స్ చేరుకుంది. గతేడాది ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన గాఫ్ ఈసారి టైటిల్ దిశగా ముందుకెళ్తోంది.
గంటా 31 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్‌లో ప్రత్యర్థి విసిరిన సవాల్‌ను ఆమె సమర్థవంతంగా తిప్పికొట్టింది. తొలి, ఏడో గేమ్‌లో అనా సర్వీస్ బ్రేక్ చేసిన గాఫ్ ఈజీగా సెట్ నెగ్గేలా కనిపించింది. కానీ, వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన అనా 5–5తో స్కోరు సమం చేసింది. ఈ టైమ్‌లో తన మార్కు చూపెట్టిన అమెరికా టీనేజర్ 11వ గ్రేమ్‌లో బ్రేక్ సాధించడంతో పాటు తర్వాతి గేమ్‌లో వరుసగా నాలుగు పాయింట్లతో సెట్ నెగ్గింది.
రెండో సెట్‌లో ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వని కొకొ ఎనిమిదో గేమ్‌లో మ్యాచ్ ముగించింది. సర్వీస్‌ల్లో అదరగొట్టిన గాఫ్ పదింటిలో ఆరు బ్రేక్ పాయింట్లు సద్వినియోగం చేసుకుంది. 22 విన్నర్లతో ఆకట్టుకుంది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ జబెర్ 6–3, 6–1తో అమెరికాకు చెందిన బెర్నార్డ పెరాను వరుస సెట్లలో చిత్తు చేసి రోలాండ్ గారోస్‌లో తొలిసారి క్వార్టర్స్ చేరింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ హడాడ్ మయా (బ్రెజిల్) 6–7 (3/7), 6–3, 7–5తో సోరిబ్స్ టొర్మో (స్పెయిన్)పై కష్టపడి విజయం సాధించింది.
రూడ్, రూనె ముందంజ
మెన్స్ సింగిల్స్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. నాలుగో రౌండ్‌లో రూడ్7–6 (7/3), 7–5, 7–5తో వరుస సెట్లలో చిలీ ప్లేయర్ నికోలస్ జెర్రీని ఓడించాడు. పది రోజుల కిందట జెనీవా ఓపెన్ ఫైనల్లో తనను ఓడించిన నికోలస్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో రూనె 7–6 (7/3), 3–6, 6–4, 1–6, 7–6 (10/7)తో 23వ సీడ్ సెరుండొలో (అర్జెంటీనా)పై టై బ్రేక్‌లో గెలిచి గట్టెక్కాడు.