23వ గ్రాండ్​ సలాం..జొకోవిచ్​

23వ గ్రాండ్​ సలాం..జొకోవిచ్​
  •     ఫ్రెంచ్ ఓపెన్​ విన్నర్​ జొకోవిచ్​
  •     రికార్డు స్థాయిలో 23 గ్రాండ్​స్లామ్స్​ టైటిల్స్​ సొంతం 
  •     4 గ్రాండ్​స్లామ్స్​ను కనీసం 3 సార్లు నెగ్గిన తొలి ప్లేయర్​గా ఘనత

పారిస్‌‌: సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. టెన్నిస్‌‌ హిస్టరీలో కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో తన కెరీర్‌‌లో 23వ గ్రాండ్‌‌ స్లామ్‌‌ టైటిల్‌‌తో మెరిశాడు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో మూడోసీడ్‌‌ జొకోవిచ్‌‌ 7–6 (7/1), 6–3, 7–5తో కాస్పర్‌‌ రుడ్‌‌ (నార్వే)పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్నాడు. ఫలితంగా స్పెయిన్‌‌ ప్లేయర్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ (22 గ్రాండ్‌‌స్లామ్స్‌‌)ను అధిగమించాడు. స్విస్‌‌ లెజెండ్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌ (20) మూడో ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. ఇక నాలుగు గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్స్‌‌ను కనీసం మూడుసార్లు నెగ్గిన తొలి పురుష ప్లేయర్‌‌గానూ జొకో రికార్డులకెక్కాడు. 2016, 2021లో సెర్బియన్‌‌ ప్లేయర్‌‌ ఫ్రెంచ్​ విన్నర్‌‌గా నిలిచాడు. జొకో ఖాతాలో 10 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌, 7 వింబుల్డన్‌‌, 3 యూఎస్‌‌ ఓపెన్‌‌ టైటిల్స్‌‌ ఉన్నాయి.  ఒక సీజన్‌‌లో నాలుగు మేజర్‌‌ టైటిల్స్‌‌ను నెగ్గిన రాడ్‌‌ లేవర్‌‌ (1969) రికార్డు ఒక్కటే జొకో ముందు మిగిలి ఉంది. 2021లో ఆస్ట్రేలియన్‌‌, ఫ్రెంచ్‌‌, వింబుల్డన్‌‌ నెగ్గిన జొకోవిచ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌లో ఓడాడు. ఓవరాల్‌‌గా సెరెనా విలియమ్స్​ (23) రికార్డును సమం చేసిన జొకోవిచ్​.. మార్గరేట్‌‌ కోర్టు ఆల్‌‌టైమ్‌‌ గ్రేటెస్ట్‌‌ రికార్డు (24 గ్రాండ్‌‌స్లామ్స్‌‌)కు అడుగు దూరంలో ఉన్నాడు. తాజా విజయంతో సోమవారం రిలీజ్‌‌ చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌‌లో సెర్బియన్‌‌ ప్లేయర్‌‌ మళ్లీ నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌కు చేరే చాన్స్‌‌ ఉంది. 

తొలిసెట్‌‌లోనే ఇబ్బంది..

3 గంటల 13 నిమిషాల మ్యాచ్‌‌లో జొకోకు తొలిసెట్‌‌లోనే రుడ్‌‌ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ సర్వీస్‌‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌‌కు వెళ్లింది. కానీ రెండో సెట్‌‌ నుంచి సెర్బియన్‌‌ ప్లేయర్‌‌ బలమైన ఫోర్‌‌, బ్యాక్‌‌ హ్యాండ్‌‌ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి పుంజుకున్నప్పుడల్లా బ్యాక్‌‌లైన్‌‌ గేమ్‌‌తో ఒత్తిడి పెంచాడు. మ్యాచ్‌‌ మొత్తంలో 11 ఏస్‌‌లు కొట్టిన జొకో ఒక డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేశాడు. 10 బ్రేక్‌‌ పాయింట్లలో మూడింటిని నెగ్గాడు. 52 విన్నర్స్‌‌, 32 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేశాడు. రుడ్‌‌ 4 ఏస్‌‌లు, ఒక్క డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేయగా, 35 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌తో ఓటమిపాలయ్యాడు.