ఫ్యాషన్ విషయానికి వస్తే హద్దులు లేవు. కాలం మారుతున్న కొద్దీ ఫ్యాషన్లో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. తాజాగా.. చికాగోలో జరిగిన తమ భారతీయ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు పురుషులు చీరలు ధరించి కనిపించారు. ఆడవాళ్లు జీన్స్, టీ షర్ట్ ధరించినట్లు.. ఇప్పుడు వీరు చీరలో ప్రత్యేక్షమై తమ స్నేహితుడిని సర్ ప్రైజ్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ చీరలో వాక్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు మహిళలు మాత్రమే చీర కట్టుకోవాలి అనే పద్దతిని ఈ ఇద్దరు స్నేహితులు మార్చేశారు.
చికాగోకు చెందిన వెడ్డింగ్ వీడియోగ్రాఫర్‌లు అయిన పారాగాన్‌ఫిల్మ్స్, వారి ఇన్స్టాగ్రామ్లో వీరి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు తమ స్నేహితుడి వివాహానికి రెడీ అవుతూ ఉంటారు. అయితే.. వీరిద్దరూ చీర కట్టుకునేందుకు ఓ మహిళ సహాయం చేస్తుంది. పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయిన వీరిద్దరూ... చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో రంగురంగుల చీరలు ధరించి అందంగా నడుచుకుంటూ హొయలు ఒలికించారు. వాళ్ల వయ్యారాలు చూసి అక్కడున్న వారంతా ఫ్లాట్ అయ్యారు. నుదుటి పై బొట్టు పెట్టుకుని అచ్చం అమ్మాయిలా రెడీ అయ్యారు. వధూవరులు ఇద్దరూ వీరిని చూసి పగలబడి నవ్వారు. ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వుకున్నారు. అక్కడున్న వారంతా వీరిద్దరినీ ప్రశంసించారు.

