అప్పుడు ఏడాది అని.. ఇప్పుడు ఐదేండ్లా?... 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?: కేటీఆర్

అప్పుడు ఏడాది అని.. ఇప్పుడు ఐదేండ్లా?... 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?: కేటీఆర్
  •     ప్రభుత్వం 10 వేల జాబ్స్‌‌కు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు 
  •     జాబ్ క్యాలెండర్‌‌‌‌కు పాతరేసిందని ఫైర్  

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడేమో ఐదేండ్లలో భర్తీ చేస్తామని చెబుతున్నదని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు తొలి ఏడాదిలోనే అని చెప్పి.. ఇప్పుడు ఐదేండ్లలో ఇస్తామంటూ పీసీసీ చీఫ్‌‌తో సీఎం చిలుకపలుకులు పలికిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని దించేయాలంటూ ఢిల్లీ నుంచి వచ్చి మరీ ప్రియాంక గాంధీ చెప్పారు. ఆమె చెప్పిన మాటలు అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది. 

కేసీఆర్​హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చిన 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫొటోలకు ఫోజులు కొట్టిన సీఎం రేవంత్.. ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రంలో రిక్రూట్‌‌మెంట్​జీరోగా మారిపోయింది. పట్టుమని 10వేల ఉద్యోగాలకు కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు” అని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం జాబ్​క్యాలెండర్‌‌‌‌కు పాతరేసి, స్కామ్‌‌లు చేస్తూ జేబులు నింపుకుంటున్నది. నిరుద్యోగులనే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది” అని అన్నారు. 

గులాబీ జెండా ఎగరాలి.. 

మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల గులాబీ జెండా ఎగరాలని పార్టీ నేతలకు కేటీఆర్​పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్‌‌చార్జులు, మున్సిపల్​కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘రెండేండ్లలోనే కాంగ్రెస్‌‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌‌కు అనుకూల వాతావరణం ఉంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గెలుపు సాధ్యం. ప్రచారంపై దృష్టిపెట్టాలి” అని సూచించారు.