రన్‌‌‌‌వేపై విమానం ఢీకొని వ్యక్తి మృతి..అమెరికా డెన్వర్ ఎయిర్ పోర్టులో ఘటన

రన్‌‌‌‌వేపై విమానం ఢీకొని వ్యక్తి మృతి..అమెరికా డెన్వర్ ఎయిర్ పోర్టులో ఘటన

డెన్వర్: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌‌‌‌వేపై వేగంగా వెళ్తున్న విమానం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విమానాశ్రయ భద్రతా కంచెను దూకి రన్‌‌‌‌వేపైకి వచ్చిన వ్యక్తిని టేకాఫ్ అవుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌‌‌‌లైన్స్ (ఫ్లైట్ 4345) విమానం సుమారు 149 మైళ్ల వేగంతో ఢీకొట్టింది. శరీర భాగాలు ముక్కలై రన్‌‌‌‌వే అంతటా చెల్లాచెదురుగా పడిపోగా, విమానం ఇంజిన్‌‌‌‌లో మంటలు చెలరేగాయి.

దీనికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విడుదల చేసిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ‘‘మేము ఇప్పుడే ఒకరిని ఢీకొట్టాం.. ఇంజిన్‌‌‌‌లో మంటలు వస్తున్నాయి”అని పైలట్ ఆందోళనగా చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. విమానంలో బాంబు పేలినంత శబ్దం వచ్చిందని, ఇంజిన్‌‌‌‌లో మానవ శరీర భాగాలు ఇరుక్కుపోయి కనిపించాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా అధికారులు, ఎయిర్‌‌‌‌లైన్స్ యాజమాన్యం సంయుక్తంగా దర్యాప్తును ప్రారంభించాయి.