కన్వేయర్ బెల్ట్ను కాదని.. లారీల్లో బొగ్గు రవాణా.. తాడిచర్ల బొగ్గు రవాణాలో AMR సంస్థ నిర్వాకం

కన్వేయర్ బెల్ట్ను కాదని.. లారీల్లో బొగ్గు రవాణా.. తాడిచర్ల బొగ్గు రవాణాలో AMR సంస్థ నిర్వాకం
  • తొమ్మిదేండ్లుగా పెండింగ్లో కన్వేయర్ ​బెల్ట్ నిర్మాణం
  • 17 కిలోమీటర్ల దూరానికి 60 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి
  • రోడ్డు ధ్వంసమవుతున్నా, ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • బొగ్గు అక్రమ తరలింపు కోసమే లారీల్లో తరలిస్తున్నారని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల బొగ్గు గనుల విషయంలో ఏఎంఆర్ సంస్థ చెప్పిందే వేదం అన్నట్లుగా ఆఫీసర్లు ప్రవర్తిస్తున్నారు. తాడిచర్ల గని నుంచి బొగ్గు రవాణా కోసం కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ నిర్మించాలన్న నిబంధనను తొమ్మిదేండ్లుగా పక్కనపెట్టారు. కన్వేయర్ బెల్ట్ నిర్మిస్తే 17.2 కిలోమీటర్ల దూరంతోనే బొగ్గును కేటీపీపీకి పంపే అవకాశం ఉంది. కానీ అదేమీ పట్టించుకోకుండా 60 కిలోమీటర్ల చుట్టూ తిప్పి లారీల్లో బొగ్గును పంపిస్తున్నారు.

బొగ్గు లారీల వల్ల రోడ్లు, పర్యావరణం దెబ్బతింటున్నా, ప్రమాదాలు జరుగుతున్నా ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్​నిర్మాణానికి అటవీ అనుమతులు వచ్చినా, రెవెన్యూశాఖ 80 శాతానికి పైగా భూ సేకరణ పూర్తి చేసి మట్టి రోడ్డు వేసినా బెల్ట్ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.

జెన్​కో నుంచి ఏఎంఆర్కు..
కేంద్ర ప్రభుత్వం జెన్‌‌‌‌‌‌‌‌కో కు 2015లో తాడిచర్ల బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌ కేటాయించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును బయట అమ్మకుండా.. చెల్పూరులోని  కేటీపీపీకి మాత్రమే సప్లై చేయాలి. బొగ్గు బ్లాక్ ను ఏఎంఆర్ సంస్థకు 25 ఏండ్ల పాటు అప్పగిస్తూ జెన్‌‌‌‌‌‌‌‌కో అగ్రిమెంట్​ చేసుకుంది. ఏఎంఆర్ సంస్థ ఏటా కనీసం 20.05 లక్షల టన్నుల బొగ్గును వెలికితీసి జెన్‌‌‌‌‌‌‌‌కోకు అందించాలి.

బొగ్గు తవ్వకాలు మొదలైన మూడేండ్లలోపే పర్యావరణ పరిరక్షణ కోసం క్లోడ్జ్ కన్వేయర్ బెల్ట్ నిర్మించాలి. కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి 26.45 ఎకరాల ఫారెస్ట్​ల్యాండ్​, 51.16 ఎకరాల రెవెన్యూ ల్యాండ్​అవసరం కాగా అటవీ శాఖ 2019 జనవరిలోనే భూమిని జెన్​కోకు కేటాయించింది. 

ఈ భూమికి బదులుగా భూపాలపల్లి మండలం పందిపంపుల గ్రామం 34/1 సర్వే నంబర్ లోని రెవెన్యూ భూమిని అటవీ శాఖకు బదలాయించారు. కానీ 51.16 ఎకరాల రెవెన్యూ భూసేకరణలో ఆలస్యం జరుగుతోంది. మైనింగ్​ అవసరాల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రెండేళ్లలోనే 2 వేల ఎకరాలు భూసేకరణ చేయించిన ఏఎంఆర్.. కన్వేయర్​బెల్ట్ భూసేకరణను మాత్రం పట్టించుకోవడం లేదు. కన్వేయర్​బెల్ట్​ ద్వారా రవాణా జరిగితే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే ఏఎంఆర్​ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

లాభాల కోసమే..
కన్వేయర్​బెల్ట్​ద్వారా బొగ్గు రవాణా చేస్తే లెక్కలు పక్కాగా ఉంటాయి. బొగ్గు బయట అమ్ముకోవడానికి వీలుండదు. జెన్​కో సంస్థ రవాణా ఖర్చులు చెల్లించదు. ఓవర్​లోడ్​ వల్ల వచ్చే మిగులు లాభాలు ఉండవు. దీనివల్ల ఏఎంఆర్​కు యేటా వందల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. 

అందుకే బెల్ట్​ నిర్మాణ పనులు పెండింగ్​లో పెడుతోందని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేండ్ల పాటు మాత్రమే లారీల్లో బొగ్గు రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా తొమ్మిదేళ్లుగా లారీల్లోనే యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రోజుకు 200కు పైగా లారీల్లో 5 వేల నుంచి 6 వేల టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది.

రవాణా చార్జీలు తగ్గించేందుకు లారీల్లో 5 నుంచి 7 టన్నుల లోడ్ వేస్తున్నారు. లారీల ఓవర్​లోడ్, ఓవర్ స్పీడ్​వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం భూపాలపల్లి ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసింది. లారీల్లో బొగ్గు రవాణా వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోంది. బొగ్గుపై టార్పాలిన్ కవర్లు కప్పకపోవడం, బొగ్గు రవాణా చేసే మార్గాల్లో నీళ్లు చల్లకపోవడంతో వచ్చే దుమ్ము, ధూళి కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మట్టి రోడ్లు వేసిన ఆఫీసర్లు
తాడిచర్ల నుంచి చెల్పూర్​ కేటీపీపీ వరకు 17.2 కిలోమీటర్ల దూరం కన్వేయర్​ బెల్ట్ కోసం సేకరించిన భూమిలో ఆఫీసర్లు మట్టి రోడ్లు వేశారు. తాడిచర్ల అటవీ శాఖ భూముల్లో 7 కిలోమీటర్ల దూరం చెట్లు కొట్టేసి మట్టి పోశారు. కాపురం, ఆన్​సాన్​పల్లి, జంగేడు, కొంపెల్లి గ్రామాల్లో సేకరించిన రెవెన్యూ భూముల్లో కూడా మట్టిని పోసి ఒదిలేశారు.

2019 నాటికే ఈ పనులన్నీ కంప్లీట్ ​అయ్యాయి. అప్పటి నుంచి గడిచిన ఏడేళ్లలో కన్వేయర్​ బెల్ట్​పనులు స్టార్ట్​ చేస్తే ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయ్యేవి. కన్వేయర్​ బెల్ట్​ నిర్మాణం కోసం కేవలం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే సరిపోయేదని, కానీ ఇప్పటి వరకు లారీల్లో బొగ్గు రవాణా కోసం రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు.