ములుగు జిల్లాలో జలపాతాల సవ్వళ్లు.. మాన్‌‌‌‌ సూన్‌‌‌‌ అందాలకు టూరిస్టులు  ఫిదా.. 

ములుగు జిల్లాలో జలపాతాల సవ్వళ్లు.. మాన్‌‌‌‌ సూన్‌‌‌‌ అందాలకు టూరిస్టులు  ఫిదా.. 
  • అప్రమత్తంగా ఉండాలి
  • బొగత మినహా ఇతర జలపాతాలకు ప్రవేశం నిషేధం
  • అత్యుత్సాహం వల్ల ప్రాణాలు కోల్పోతున్న యువత
  • గత ఏడాది వరకు 31 మంది మృతి
  • పర్యాటకుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం

ములుగు, వెంకటాపురం : తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగత జలపాతంతో పాటు మరో మూడు జలపాతాలు  ములు జిల్లాలో ఈ వర్షాకాలంలో పర్యాటకులను ఆకర్షించనున్నాయి. జలజల పారే జలపాతాలు, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఆనందం కోసం వచ్చే పర్యాటకుల చిన్నపాటి నిర్లక్ష్యం విషాదాలకు దారితీస్తోంది. గత పన్నెండేళ్లలో 30 మందికిపైగా  ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన ములుగు జిల్లాలో వాజేడు, వెంకటాపురం మండలాల్లోని జలపాతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బొగత జలపాతంతో పాటు కొంగాల దూసపాటిలోద్ది, ముత్యంధార, మహితాపురం జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. వర్షాకాలం నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు ఈ ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.  

అయితే రక్షణ చర్యల లోపం, పర్యాటకుల అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బొగత జలపాతం వద్ద అధికారులు విధించిన నిబంధనలను పట్టించుకోకుండా కొందరు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంగాల జలపాతం వద్దకు  అటవీ, పోలీసు శాఖలు ప్రవేశాన్ని నిషేధించాయి. ముత్యంధార, మహితాపురం జలపాతాలు అడవిలో ఉండటంతో అక్కడికి వెళ్లడం కూడా ప్రమాదకరమే.

అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌‌‌‌ వరకు బొగత జలపాతంలో 23 మంది, కొంగాల సమీపంలోని దూసపాటిలోద్ది జలపాతంలో 8 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ముత్యంధార జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన 15 మంది వరదల కారణంగా అడవిలో చిక్కుకోగా పోలీసులు వారిని సురక్షితంగా రక్షించారు.

పర్యాటకులు తమ విహారయాత్రను విషాదయాత్రగా మార్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. బొగత వద్ద ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలను పాటించాలని, భారీ వర్షాల సమయంలో హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలని కోరుతున్నారు. మద్యం సేవించి జలపాతాల వద్దకు రావొద్దని, నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచిస్తున్నారు.

బొగతకు వచ్చే పర్యాటకులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌‌‌‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌‌‌‌ బోర్ఖడే హేమంత్‌‌‌‌ సహదేవరావు   తెలిపారు. సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్ఠం చేస్తామని చెప్పారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, అధికారుల సూచనలు పాటిస్తూ పర్యాటకులు సురక్షితంగా విహారయాత్రను ఆస్వాదించాలని ఆయన కోరారు.