ముంచుకొస్తున్న వ్యాధుల ముప్పు.. 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే విషయాలు

ముంచుకొస్తున్న వ్యాధుల ముప్పు.. 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే విషయాలు
  • 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు
  • జ్వరాలు, డయేరియా, శ్వాసకోశ ఇబ్బందులు
  • సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రతా చర్యలు తప్పనిసరి
  • ప్రతి జిల్లాలో మానిటర్ సర్వైలెన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచనలు

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ముంగిట రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు, సీజనల్ జ్వరాలు డేంజర్​బెల్స్ మోగిస్తున్నాయి. హైదరాబాద్ ​కేంద్రంగా చేపట్టిన మానిటర్ సర్వైలెన్స్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 15 మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏకంగా 14,416 అంటువ్యాధుల కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో కేవలం రాజధానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అంటువ్యాధుల వ్యాప్తిని ముందే గుర్తించి కట్టడి చేసేందుకు వీలుగా జిల్లా స్థాయి సర్వైలెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జోన్లవారీగా కేసులు.. 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు నిఘా వ్యవస్థ ఎందుకు అవసరమో స్పష్టంగా అర్థమవుతుంది. నగరంలో వచ్చిన కేసుల్లో సాధారణ జ్వరాలు (7 రోజుల కంటే తక్కువ వ్యవధి) అత్యధికంగా 5,438 రికార్డు కాగా, అందులో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోనే 2,447 కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 559, చార్మినార్‌‌‌‌‌‌‌‌లో 326 కేసులు రాగా, తీవ్ర జ్వరాలు (7 రోజుల కంటే ఎక్కువ) 1,514 నమోదయ్యాయి. ఇందులోనూ సికింద్రాబాద్ పరిధిలోనే 635 కేసులు వెలుగు చూశాయి. 

వీటన్నింటికీ తోడు కుక్క కాటు కేసులు 4,395 నమోదు కాగా, ఒక్క సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోనే 2,824 కేసులు ఉండటం గమనార్హం. తీవ్ర విరేచనాలు 924, శ్వాసకోశ ఇబ్బందులు 1,603 నమోదయ్యాయి. సరైన పారిశుధ్యం, దోమలు, ఈగల నివారణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఈ డేటా హెచ్చరిస్తోంది. 

ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన తాగునీరు, దోమల ముప్పు
వ్యాధుల నిర్ధారణ కోసం నిర్వహించిన ల్యాబ్ పరీక్షల (ఎల్-ఫామ్) ఫలితాలు కూడా ప్రజారోగ్య రక్షణలో ముందస్తు చర్యల ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నాయి. మొత్తం 2,570 మందికి పరీక్షలు చేయగా, 36 మందికి వివిధ రకాల అంటువ్యాధులు పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలాయి. 

ఇందులో అత్యధికంగా 22 డెంగ్యూ కేసులు ఉండటం వర్షాకాలంలో దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని స్పష్టం చేస్తోంది. వీటితో పాటు టైఫాయిడ్- 7, లెప్టోస్పైరోసిస్- 3, మలేరియా- 1, స్క్రబ్ టైఫస్- 1, హెపటైటిస్ ఎ- 1, హెపటైటిస్ ఇ- 1 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోల్కొండ జోన్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 90 టైఫాయిడ్ అనుమానిత కేసులు నమోదు కావడం, ల్యాబ్ పరీక్షల్లోనూ టైఫాయిడ్, హెపటైటిస్ (కామెర్లు) కేసులు నిర్ధారణ కావడం ఆయా ప్రాంతాల్లో తాగునీరు కలుషితం అవుతోందని నిరూపిస్తోంది.

ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ మోడల్
మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ప్రధాన విధి ఏంటంటే గ్రేటర్​లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జ్వరం, విరేచనాలు, కుక్కకాటు గురైన పేషెంట్ల వివరాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్ ఐహెచ్ఐపీ ద్వారా ప్రతిరోజూ సేకరిస్తుంది. ఏదైనా ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా రోగాలు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, అధునాతన మ్యాపింగ్ సాంకేతికత (జీఐఓస్​)తో ఆ ప్రాంతాన్ని వెంటనే ప్రమాదకరమైన హాట్‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌గా గుర్తిస్తుంది. 

ప్రత్యేక వైద్య బృందాలు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి వ్యాధి మరింత వ్యాపించకుండా అడ్డుకుంటాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి అంటురోగాలు ప్రబలుతున్నాయి ? ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి ? ఎందుకు అనే కోణంలో ఎంఎస్​యూ పనిచేస్తుంది. తాగునీటి నాణ్యత, వాతావరణ మార్పులు, దోమల వ్యాప్తి వంటి అంశాలను ఏఐతో అనుసంధానించి ఒకే వ్యవస్థ కింద పర్యవేక్షిస్తుంది.

మనుషుల్లో వచ్చే రోగాలనే కాకుండా ‘వన్ హెల్త్’ విధానంతో జంతువుల ద్వారా వచ్చే వ్యాధులపైనా అప్రమత్తం చేస్తారు. గ్రేటర్​లో ప్రయోగత్మకంగా అమలవుతున్న ఈ  వ్యవస్థ ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌పూర్, ఎయిమ్స్ ఢిల్లీ భాగస్వామ్యంతో  ఏఐ సాంకేతికతను వాడుతూ తాగునీటి కాలుష్యాన్ని ముందే గుర్తిస్తున్నారు. 

ఇందుకు హైదరాబాద్ ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ భవనంలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌ను, నారాయణగూడ ఐపీఎంలో వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. విజయవంతమైన మోడల్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేస్తే, స్థానికంగా వచ్చే వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందస్తుగా ప్లానింగ్​ చేసుకునే వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రైవేట్ ఆసుపత్రుల సమన్వయం 
ఈ  వ్యవస్థ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యం అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 2,574 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించినప్పటికీ, ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ 95 శాతంతో క్రియాశీలకంగా వివరాలు నమోదు చేస్తుంటే, ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యం 3 శాతం లోపే ఉండటం గమనార్హం.

ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సర్వైలెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఇదే సమస్య ఎదురుకాకుండా ముందే కఠిన నిబంధనలు అమలు చేయాలని చూస్తున్నారు.