జనగామ, వెలుగు : ఇన్‌కం పెంపు కోసం జనగామ మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ పరిధిలో కమర్షియల్ ప్రాపర్టీస్‌ను మళ్లీ కొలతలేస్తోంది. తద్వారా టాక్స్ ఎగ్గొట్టడమో.. తక్కువ చెల్లింపులు జరపకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జనగామ మున్సిపాలిటీలో టాక్స్ చెల్లించే నిర్మాణాలు 15,518 ఉన్నాయి. వీటిలో పూర్తి కమర్షియల్ నిర్మాణాలు 1138 ఉండగా. షాపులు, ఇండ్లు కలిపి 1670 ఉన్నాయి.
ఇండ్లకు మీటరుకు రూ. 17 నుంచి రూ. 24 టాక్స్ చెల్లింపు ఉండగా కమర్షియల్ ప్రాపర్టీస్‌కు మీటరుకు రూ. 24 నుంచి రూ. 28 టాక్స్ రూపేణా చెల్లిస్తున్నారు. అయితే కొందరు కమర్షియల్‌గా వాడుతున్న ఇండ్లుగానే చూపిస్తూ టాక్స్ తక్కువగా చెల్లిస్తున్నారు. పూర్తి కమర్షియల్ నిర్మాణాలు కలిగిన వాళ్లు కూడా విస్తీర్ణంలో తేడా చూపించి తక్కువగా టాక్స్ చెల్లిస్తున్నారు.
ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల నిర్మాణ సమయంలో కొందరు యజమానులు తక్కువ విస్తీర్ణం చూపించి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత విస్తరించారు. టాక్స్ మాత్రం తక్కువ విస్తీర్ణానికే చెల్లింపులు చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికి మున్సిపాలిటీ స్టాఫ్ రంగంలోకి దిగింది. ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో మళ్లీ కొలతలేస్తున్నారు. తాజాగా తీసుకున్న కొలతల ప్రకారం టాక్స్ నిర్ణయించనున్నారు.
