వేములవాడ, వెలుగు: అర్హులైన రైతులకే రాజన్న కోడెలను పంపిణీ చేస్తున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు బుధవారం 120 జతల కోడెలను కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను అందజేస్తున్నామన్నారు.
కోడెలను ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడ నియోజకవర్గంలోని మర్రిపల్లిలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల స్థలం గోశాలకు కేటాయించిందని, త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఈవో రమాదేవి, జిల్లా వెటర్నరీ డాక్టర్ రవీందర్ రెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం
పాల్గొన్నారు
