గోల్డ్ గుట్టు విప్పలే.. కరీంనగర్ PMJ జ్యువెల్లరీ కేసులో బంగారం ఆచూకీ చెప్పని నిందితులు

గోల్డ్ గుట్టు విప్పలే.. కరీంనగర్ PMJ జ్యువెల్లరీ కేసులో బంగారం ఆచూకీ చెప్పని నిందితులు
  • దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు దొంగలు ఇంకా పరారీలోనే..
  • ముగిసిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ కస్టడీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకొని విచారించినా దోచుకున్న బంగారం గుట్టు మాత్రం చెప్పడం లేదు. దోపిడీకి ఉపయోగించిన పిస్టల్, వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గోల్డ్ ను మాత్రం రాబట్టలేకపోయారు.

ఈ కేసులో 13 మంది భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించగా.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న రఘునాథ్ కర్మకార్ అలియాస్ జాగిరా సింగ్, రవీశ్ కుమార్ అలియాస్ ప్రద్యుమ్న్, సూర్యమణి అలియాస్ సనోజ్ ను ఇప్పటికే అరెస్ట్ చేయగా... మరో ఇద్దరు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ఒక టీమ్ కు మరో టీమ్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా పని చేయడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్ గా మారింది. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ నోరు విప్పకపోవడంతో మిగతా నిందితులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ముందుకెళ్తున్నట్లు తెలిసింది. 

ముగిసిన కస్టడీ 
కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న సుబోధ్ సింగ్, రఘునాథ్, రవీశ్, అమర్ సింగ్, జైనుల్లాబ్దీన్ కస్టడీ బుధవారంతో ముగింది. విచారణలో భాగంగా రఘునాథ్ ఇచ్చిన సమాచారంతో.. దోపిడీకి ఉపయోగించిన బైక్‌‌‌‌‌‌‌‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సనోజ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో రామడుగు శివార్లలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద దాచిన ఐదు జతల దుస్తులు, మూడు జతల షూస్ తో పాటు పిస్టల్, మ్యాగజైన్, మూడు బైక్స్ కు సంబంధించిన నకిలీ ఆర్సీ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో మరో నిందితుడు 
బిహార్లోని పాట్నా జిల్లా పుల్వరి షరీఫ్ వద్ద మరో నిందితుడు ఆదిల్ ఖాన్ ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.