ఫ్రీ బస్తో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: మంత్రి కోమటిరెడ్డి

ఫ్రీ బస్తో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: మంత్రి కోమటిరెడ్డి
  • కాంగ్రెస్ వచ్చాక ఆర్టీసీ రూపురేఖలు మారినయ్: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ రూపురేఖలే మారిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రూ.1,078 కోట్లతో 2,815 కొత్త బస్సులను కొనుగోలు చేశామన్నారు. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రికల్ బస్సులను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. రూ. 1.15 కోట్లతో చేపట్టిన నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహాలక్ష్మి స్కీం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 383 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగాయని, వీటి వల్ల మహిళలకు రూ.10,950 కోట్లు మిగిలాయని, ఒక్క నల్గొండ జిల్లాలోనే మహిళలు రూ.382 కోట్లు ఆదా  చేసుకున్నారని తెలిపారు. మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా, వ్యాపార భాగస్వాములుగా మారుస్తున్నామని చెప్పారు. మహిళా సమాఖ్యల ద్వారా 553 బస్సులను నడిపిస్తున్నామని, ఒక్కో బస్సుపై నెలకు రూ.70 వేల ఆదాయం వస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మా గ్రూపులకు సైతం ఇలాంటి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు వెల్లడించారు.

నల్గొండ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ సిటీగా  తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల నిధులు భారీ మొత్తంలో వస్తున్నాయన్నారు. నల్గొండ బస్టాండ్ లో ఫౌంటెయిన్లు, మోడ్రన్ టాయిలెట్లు, వెయిటింగ్ గార్డెన్లు, అదనపు ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ స్టూడెంట్లు, మహిళల కోసం చెరువుగట్టు నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ వరకు, దర్వేశిపురం నుంచి దుప్పలపల్లి వరకు సిటీ బస్సులను నడిపిస్తామన్నారు. 

ఈ నెల 28న కనగల్ వేదికగా సీఎం చేతుల మీదుగా భారీ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు, ఎక్స్‌‌‌‌‌‌‌‌ ప్రెస్ వేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు త్వరలోనే డ్రై పోర్టు కూడా రాబోతోందని చెప్పారు. నల్గొండ ప్రజలు తనకున్నది కేవలం రాజకీయ బంధం మాత్రమే  కాదని, పేగు బంధమని చెప్పారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్టీసీ ఈడీ కురిసిషా ఖాన్, మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.