వనపర్తి జిల్లాలో పలుగు రాళ్ల కోసం బ్లాస్టింగ్లు.. క్వారీల తవ్వకాలతో ఇండ్లలో పగుళ్లు

వనపర్తి జిల్లాలో పలుగు రాళ్ల కోసం బ్లాస్టింగ్లు.. క్వారీల తవ్వకాలతో ఇండ్లలో పగుళ్లు
  • వనపర్తి జిల్లా ఏదుల, పెబ్బేరు, శ్రీరంగాపూర్  మండలాల్లో బ్లాస్టింగులు
  • అక్రమ బ్లాస్టింగులను పట్టించుకోని ఆఫీసర్లు
  • ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్తులు

వనపర్తి/పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో పలుగు రాళ్ల కోసం చేస్తున్న బ్లాస్టింగ్​లు పల్లెవాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో మండలంలో పలుగు రాళ్ల తవ్వకాలను అనుమతించవద్దని గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు. 

పెబ్బేరు మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్  గ్రామంలో పెద్ద గుట్టపై పలుగు రాళ్ల కోసం బ్లాస్టింగులు చేస్తుండడంతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఎన్నిసార్లు రిపేరు చేయించుకున్నా బ్లాస్టింగులు జరిగినప్పుడల్లా గ్రామంలోని 50 ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఇంట్లో ఉన్న సామాన్లు కింద పడుతున్నాయి. పై కప్పు రేకులు పగిలి ఇబ్బంది పడడంతో పాటు దూలాలు పర్రెలు వచ్చి విరిగిపోతున్నాయి.  రూల్స్ కు వ్యతిరేకంగా పనులు జరుగుతుండడంతో కార్మికులు సైతం ఇబ్బంది పడుతున్నారు. 

ఇష్టారాజ్యంగా బ్లాస్టింగులు..
ఏటిగడ్డ శాఖాపూర్  గ్రామంలో పెద్ద గుట్టపై సర్వే నంబరు 521లో 1972లో అప్పటి ప్రభుత్వం ఎస్సీ, బీసీ రైతులకు భూమి పట్టాలు ఇచ్చింది. గ్రామ రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో 39 ఎకరాలను ఎస్వీఆర్  మినరల్స్  కంపెనీకి 1999లో పలుగు రాళ్ల క్వారీ ఏర్పాటు కోసం లీజుకు ఇచ్చారు. 2021లో గడువు ముగియగా, అప్పటి సర్కారు నుంచి 2041 వరకు లీజు గడువు పొడగించుకున్నారు. 

ఇష్టారాజ్యంగా ప్రమాదకర స్థాయిలో బ్లాస్టింగులు చేస్తూ కార్మికులతో ప్రమాదకర పరిస్థితిలో పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ టిప్పర్  డ్రైవర్  బ్లాస్టింగు కారణంగా చనిపోతే పొక్లెయిన్ తో  స్తంభాన్ని పైకి ఎత్తుతుండగా పోల్​ అతడి మీద పడి చనిపోయినట్లు నమ్మించి, మృతుడి ఫ్యామిలీకి పరిహారం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే  శ్రీరంగాపూర్​ మండలం తాటిపాముల వద్ద క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి.

తాజాగా రేకులపల్లి వద్ద..
ఏదుల మండలం రేకులపల్లి గ్రామ శివారులో సర్వే నం105లో 24 హెక్టార్లలో పలుగు రాళ్లు తవ్వడానికి 2023లో అనుమతి ఇచ్చారు. తవ్వకాల ప్రారంభానికి ముందు ప్రజాభిప్రాయం సేకరించేందుకు పర్యావరణ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందే గ్రామస్తులు తవ్వకాలకు అనుమతించవద్దని కలెక్టర్, తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు. 

రేకులపల్లితో పాటు ముందుతండా, రేకులపల్లితండా, శాఖాపూర్​ గ్రామాల్లో పర్యవరణానికి ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. క్వారీల తవ్వకం వద్దంటూ నిరసన తెలిపారు. అయినా అధికారులు తవ్వకానికి అగ్రిమెంట్​ చేశారని తెలిసి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలతో పచ్చని పల్లెల్లో వాతావరణం కలుషితం కావడమే కాకుండా బ్లాస్టింగుల ధాటికి ఇండ్లు నెర్రెలిస్తున్నాయని సర్పంచ్​ ప్రభాకర్​ నాయక్​ తెలిపారు. 

నిబంధనలు బేఖాతర్..
ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్​ చేస్తూ క్వారీ నిర్వాహకులు తమ భూములను ఆక్రమించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. గుట్టకు ఆనుకొని ఉన్న పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి మట్టి పోసి గుడిసెలు వేయించి 9 ఎకరాల వరకు కంపెనీ ఆక్రమించుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భూములు ఆక్రమించుకోవడంతో పాటు భూములకు పరిహారం ఇవ్వమని  అడిగినా పట్టించుకోవడం లేదంటున్నారు. 25 ఏండ్లుగా కలెక్టర్లకు ఈ విషయం చెప్పినా, ధర్నాలు చేస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుత్తేదారు అన్ని అనుమతులు తీసుకున్నాకే అనుమతిస్తామని మైనింగ్​ ఏడీ గోవిందరాజులు తెలిపారు.