లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌కు తొలి అడుగు... భూసేకరణకు రూ. 587 కోట్లు విడుదల

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌కు తొలి అడుగు... భూసేకరణకు రూ. 587 కోట్లు విడుదల

చేవెళ్ల/షాద్​నగర్​, వెలుగు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 587 కోట్లు విడుదల చేయడంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియ ప్రారంభించారు. బుధవారం పరిగి, షాద్‌‌‌‌నగర్ ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ చంద్రారెడ్డి, వికారాబాద్ అడిషనల్​ కలెక్టర్ వెంకటాచారి, పునరావాస శాఖ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇరిగేషన్ అధికారులు, సర్వే సిబ్బంది జిల్లేడు చౌదరిగూడెం మండలంలోని ప్రతిపాదిత రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. 

అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌‌‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రాంతానికి సాగునీరు తీసుకురావడమే లక్ష్యంగా ఎంతో కృషి చేశామన్నారు. షాద్‌‌‌‌నగర్, పరిగి నియోజకవర్గాల్లో నీళ్లు పారే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు.

1,510 ఎకరాల భూసేకరణ..

రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 1,510 ఎకరాల భూమి అవసరమని అధికారులు తెలిపారు. ఇందులో షాద్‌‌‌‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారం తదితర గ్రామాల్లో 278.35 ఎకరాలు, పరిగి నియోజకవర్గ పరిధిలో 1,200కు పైగా ఎకరాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. సైదుపల్లి గ్రామంలో 800కు పైగా ఎకరాలు, కుల్కచర్ల మండలం అల్లాపూర్ వద్ద 83.31 ఎకరాల భూమి అవసరమవుతుందని తెలిపారు. కాలువలు, ఇతర నిర్మాణాల కోసం అదనపు భూమి కూడా అవసరమవుతుందని పేర్కొన్నారు. 

భూసేకరణకు రైతులు సహకరించాలని, భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే భూ సర్వే నిర్వహించి తదుపరి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పొలాల వద్దే భూసమస్యలు పరిష్కారం..

షాద్‌‌‌‌నగర్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన సభ వద్దే అధికారులు భూసమస్యలను పరిష్కరించారు. షాద్‌‌‌‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ భూములు రెవెన్యూ పరంగా వెంకిర్యాల గ్రామ పరిధిలో నమోదై ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులు భూములు విక్రయించినప్పటికీ ఇప్పటికీ వారి పేర్లు లేదా వారసుల పేర్లు రికార్డుల్లో కొనసాగుతున్నాయి. 

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సమస్యపై స్పందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అడిషనల్​ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో సరిత, తహసీల్దార్ తదితర అధికారులు వెంకిర్యాల గ్రామ శివారులోని రైతుల పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతుల మధ్య కూర్చొని వారి సమస్యలను విన్న అధికారులు రైతులు సమర్పించిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి, సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేశారు.