ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై ఆశలు సన్నగిల్లడం, ఇతర కీలక అంశాలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో, సోమవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా క్షీణించాయి. దింతో సెన్సెక్స్ దాదాపు 1,320 పాయింట్లు పడిపోయి 76,008 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు నష్టపోయి 23,811 వద్దకు చేరింది. పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీనివల్ల ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా పరిస్థితులు మారడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పడిపోయాయి.
అన్ని రంగాల్లోనూ నష్టాలే
మార్కెట్‌లోని దాదాపు 16 ముఖ్యమైన రంగాలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. కేవలం పెద్ద కంపెనీలే కాకుండా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ఏయే షేర్లు ఎంత పడిపోయాయంటే
ముడిచమురు ధరలు పెరగడంతో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీల షేర్లు సుమారు 2.6% పడిపోయాయి.
ప్రయాణాలపై ఆంక్షలు ఉండొచ్చనే భయంతో ఇండిగో 4% పడిపోగా, ఇండియన్ హోటల్స్, థామస్ కుక్ వంటి కంపెనీలు 5% వరకు నష్టపోయాయి. బంగారం, ఆభరణాల షేర్లు అత్యంత దారుణంగా దెబ్బతింది. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి షేర్లు 7% నుండి ఏకంగా 11% వరకు పడిపోయాయి.
మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా షేరు మాత్రం 2.6% లాభపడింది. కంపెనీ లాభాలు అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. చివరికి యుద్ధ భయాలు, చమురు ధరల పెరుగుదల, నిత్యావసరాల వినియోగం తగ్గుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముకోవడంతో మార్కెట్ కుప్పకూలింది.
