కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలు పెంచిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని లీకులు వస్తున్నాయి. అతి త్వరలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లోనే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 4 నుంచి 5 రూపాయల వరకు పెరగనున్నట్లు ఆ కథనం సారాంశం. ఇంటర్నేషనల్ క్రూడాయిల్ మార్కెట్లో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125 డాలర్లకు చేరుకోవటం.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సప్లయ్ దెబ్బతినటంతో.. డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ అధిక ధరలకు కొనుగోలు చేయటం వల్ల.. ఆయిల్ కంపెనీలు రోజుకు 2 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. మరికొన్ని నెలలు లేదా సంవత్సరాలు క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే నష్టాలను భర్తీ చేయటం కోసం.. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు అనివార్యం అంటూ జాతీయ మీడియా ఇండియా టుడే కథనం స్పష్టం చేస్తుంది.
ఒక్క పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. డొమెస్టిక్.. మనం ఇళ్లల్లో ఉపయోగించే 14 కేజీల గ్యాస్ బండ రేట్లు కూడా పెరగనున్నట్లు సంకేతాలు ఇస్తుంది కేంద్రం. సిలిండర్‌పై 50 రూపాయల వరకు పెంపు తప్పదనే అంచనాకు వచ్చినట్లు కథనంలో వివరించారు. ఇప్పటికే ఆకాశనంటుతున్న నిత్యవసరాల ధరలతో చితికిపోతున్న సామాన్యులకు ఇది పిడుగులాంటి వార్తే.
అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
కానీ ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడటంతో పెట్రోల్, డీజిల్ ధరలపై పెంపుపైన చర్చ మొదలైంది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో పెట్రోల్, డీజిల్ ధరల మోత తప్పుదేమో అంటున్నారు విశ్లేషకులు.
