రోడ్లమీద తిరగడానికి అలవాటు పడ్డారు.. ఆశా కార్యకర్తలపై గద్వాల ఎమ్మెల్యే ఫైర్

రోడ్లమీద తిరగడానికి అలవాటు పడ్డారు.. ఆశా కార్యకర్తలపై గద్వాల ఎమ్మెల్యే ఫైర్
  • క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల డిమాండ్

గద్వాల, వెలుగు : రోడ్లపై తిరగడానికి అలవాటుపడ్డారని, ఇతరుల నుంచి డబ్బు తీసుకొని సమ్మె చేస్తున్నారని ఆశా కార్యకర్తలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్  మండల కేంద్రంలో ఓ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించేందుకు వెళ్లివస్తున్నారు. ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆశాలు రోడ్డుపై రాస్తారోకో చేస్తుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వారిని చూసి ఒక్కసారిగా ఫైర్  అయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘రోడ్లపై తిరిగేందుకు అలవాటుపడ్డారు. వేరే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకొని సమ్మె చేస్తున్నారు. సంవత్సరం సమ్మె చేసినా ఆశాల కోరికలు నెరవేరవు. 

మీకు (ఆశాలకు) పోయేకాలం దగ్గర పడింది” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంగన్ వాడీ టీచర్లు సమ్మె చేయకుండానే తాము చెప్పినట్టు విన్నందుకు సమస్యలు పరిష్కారం అయ్యామని, ఆశాలు కూడా తాను చెప్పినా వినకుండా సమ్మె చేస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే  తీరుపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు.