ఇమ్రాన్ ఖాన్ ఫొటో తీసేస్తారా? గంగూలీ స్పందన ఇదీ

ఇమ్రాన్ ఖాన్ ఫొటో తీసేస్తారా? గంగూలీ స్పందన ఇదీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను ఒక్కొక్కటిగా భారత్ లోని స్టేడియాలు, క్రికెట్ బోర్డులు తొలగిస్తున్నాయి. ఒకప్పుడు పాక్ టీమ్ కెప్టన్ గా ఉన్న ఆయన ఫొటోలు.. భారత్ లోని పలు స్టేడియమ్స్ లో ఉన్నాయి. పుల్వామా దాడి నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆయన ఫొటోను తీసేసింది. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్ ఫొటోలను తొలగించింది. అలాగే ఇమ్రాన్‌ఖాన్‌ ఉండే పాకిస్థాన్ జట్టు ఫొటోను కూడా తీసేశారు.

ఇప్పడు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కూడా ఇమ్రాన్ ఫొటోను తీసేయనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ క్రికెట్ చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీని మీడియా దీనిపై ప్రశ్నించింది. ఇమ్రాన్ ఫోటోను తీసేస్తున్నారా అని అడగ్గా.. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే దీనిపై ఆయన నిర్ణయాన్ని నేరుగా ప్రకటించనప్పటికీ బోర్డులో చర్చించి ఇమ్రాన్ ఫొటోను తీసేస్తారని సమాచారం. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని ఇమ్రాన్ ఫొటో తొలగింపు దాదాపు కన్ఫమ్ అని తెలుస్తోంది.

రెండు పాయింట్లు కాదు.. వరల్డ్ కప్ కావాలి

పాక్ తో క్రికెట్ కప్ ఆడడంపై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ స్పందించారు. పాక్ తో  మ్యాచ్ ఆడకుండా బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్ పై సచిన్ శుక్రవారం మాట్లాడుతూ ఆ మ్యాచ్ ఆడి మరోసారి చిత్తుగా ఓడిద్దామని టీమిండియాకు పిలుపునిచ్చారు. మ్యాచ్ ను బాయ్ కాట్ చేసి పాక్ కు ఫ్రీగా రెండు పాయింట్లు ఇవ్వడమనేది తనకు అసహ్యం కలిగిస్తుందని చెప్పారు.

దీనిపై స్పందించిన గంగూలీ.. ‘సచిన్ కు పాక్ టీమ్ పై గెలిచి రెండు పాయింట్లు సాధించడం కావాలేమో… నాకు మాత్రం వరల్డ్ కప్ గెలవడం కావాలి’ అని అన్నారు. అయితే పాక్ పై మ్యాచ్ ఆడాలా వద్ద అన్నది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని, దానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు.