ఫాస్ట్ డెలివరీ అంటూ గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు

ఫాస్ట్  డెలివరీ అంటూ గ్యాస్ బుకింగ్ పేరుతో  సైబర్ మోసాలు
  • బుకింగ్‌‌ పేరిట వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు
  • వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి: సీపీ సజ్జనార్

బషీర్​బాగ్, వెలుగు: వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వెతికే అమాయకులనే లక్ష్యంగా చేసుకొని కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు ఇస్తూ వెంటనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనంగా కావాలంటే సిలిండర్లు అందజేస్తామని చెప్పి మభ్యపెడుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌‌‌‌ల ద్వారా ఫేక్ వెబ్‌‌‌‌సైట్ లింకులను పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

ఇలాంటి మెసేజ్‌‌‌‌లు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని సూచించారు. గ్యాస్ బుకింగ్ లేదా ఆన్‌‌‌‌లైన్ చెల్లింపుల కోసం సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌‌‌‌సైట్లు, గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే వినియోగించాలని కోరారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్‌‌‌‌ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ పంచుకోవద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్‌‌‌‌సైట్లలో వివరాలు నమోదు చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని ఆయన సూచించారు.