
మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 ను జర్మనీ సొంతం చేసుకుంది. జర్మనీ, బెల్జియం మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోరులో జర్మనీ 5–4 గోల్స్ తేడాతో ఓడించింది. షూటౌట్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంను జర్మనీ చిత్తు చేసి ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది.
హోరా హోరీ..
మ్యాచ్ మొదలైన 9వ నిమిషంలోనే బెల్జియం గోల్ సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఫ్లోరెంట్ అద్భుతంగా గోల్ చేశాడు. ఆ తర్వాత 10వ నిమిషంలో టాన్ గయ్ చేసిన మరో గోల్తో బెల్జియం ఆధిక్యం 2–0కు పెరిగింది. ఈ సమయంలో పుంజుకున్న జర్మనీ 28వ నిమిషంలో గోల్ కొట్టింది. వాలెన్ గోల్తో స్కోరును 2–1కి తగ్గించింది. ఆ తర్వాత 40వ నిమిషంలో గొంజాలో, 47వ నిమిషంలో మాట్స్ గోల్స్ సాధించడంతో జర్మనీ 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా బెల్జియం ప్లేయర్ బూన్ 58వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశారు. దీంతో మ్యాచ్ షూటౌట్కు దారితీసింది.
ఉత్కంఠ....
షూటౌట్లోనూ రెండు జట్ల స్కోరు 3–3తో సమం అయ్యాయి. దీంతో సడెన్ డెత్ తొలి ప్రయత్నంలో జర్మనీ, బెల్జియం సఫలం కావడంతో స్కోర్లు 4-–4తో మళ్లీ సమమయ్యాయి. చివరికి టైబ్రేకర్‌లో మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో జర్మనీ తరపున ఫ్రింజ్ గోల్ కొట్టగా..బెల్జియం తరపున కొయన్స్ విఫలం కావడంతో వరల్డ్ కప్ జర్మనీ వశమైంది. జర్మనికి ఇది మూడో హాకీ వరల్డ్ కప్. గతంలో 2002,2006లోనూ జర్మనీ వరల్డ్ కప్ గెలిచింది.
భారత్ కు 9వ స్థానం
ఈ హాకీ ప్రపంచకప్‌ను భారత్ 9వ స్థానంతో ముగించింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్..కనీసం క్వార్టర్స్ కూడా చేరలేకపోయింది. చివరిసారిగా భారత్ 1975లో హాకీ వరల్డ్ కప్‌ను దక్కించుకుంది. అంతకుముందు 1971 వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. 1973 లో రన్నరప్‌గా నిలిచింది. ఇక 1975 తర్వాత భారత్ ఒక్కసారిగా కూడా సెమీస్ చేరలేకపోయింది.