పనుల ఆలస్యంపై కమిషనర్ ఆగ్రహం..ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ , హెచ్సిటీ పనులపై సమీక్ష

పనుల ఆలస్యంపై కమిషనర్ ఆగ్రహం..ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ , హెచ్సిటీ పనులపై  సమీక్ష
  • పనితీరు మారకపోతే  చర్యలు తప్పవని హెచ్చరిక

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, హెచ్​సిటీ పనులు మందకొడిగా నడుస్తుండడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరోసారి ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ ఆఫీస్‌లో మంగళవారం ఎస్ఎన్ డీపీ,హెచ్ సిటీ ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధి, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనుల పురోగతిపై జోనల్ కమిషనర్లు, ప్రాజెక్ట్స్ ఇంజినీర్లు, ప్లానింగ్, ఇరిగేషన్, భూ సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఆరు జోన్ల పరిధిలో చెరువుల అభివృద్ధిలో భాగంగా 83 పనులు చేపట్టగా, 25 పనులు మాత్రమే ప్రారంభం కావడం, లేక్స్ అభివృద్ధి, పునరుద్ధరణ పనులు స్లో గా జరగడంపై కమిషనర్ ఫైర్ అయ్యారు.  ఇరిగేషన్ ఇంజినీర్లు సరిగా పనిచేయడంలేదని, వారంలో లేక్స్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ల ద్వారా ఫీల్డ్​విజిట్​చేయించి రిపోర్టు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 25న ఫలక్ నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించేందుకు  సిద్ధం చేయాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ పాటిల్, అపూర్వ చౌహాన్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్  రాములునాయక్ పాల్గొన్నారు.

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు పనులను పరిశీలించిన  కమిషనర్....  

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు పనులను మంగళవారం కమిషనర్ పరిశీలించారు. హెచ్‌ – సిటీ లో కీలకమైన కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఏడు జంక్షన్లలో రాబోయే రోజుల్లో 4.6 కి.మీ పొడవు తో  ఫ్లైఓవర్లు, 2.8 కి.మీ అండర్‌పాస్​లు నిర్మించబోతున్నట్టు చెప్పారు. వీటితో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహం సులభతరమవ్వడంతో పాటు, రద్దీ గణనీయంగా తగ్గుతుందన్నారు.

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌ సిటీ పనులను సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని,  పనుల గ్రౌండింగ్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను  ఆదేశించారు. వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) భాస్కర్ రెడ్డి, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ వి సమ్మయ్య తో  తదితరులు ఉన్నారు.