- వెలిగే లైట్లకే నిర్వహణ ఛార్జీల చెల్లింపు
- రిపేర్లు స్పీడ్‌గా చేసేందుకు 60 క్రేన్లను రెడీ చేస్కోవాలె
- ఏజెన్సీలతో ప్రీ బిడ్ సమావేశం విధివిధానాలు వివరించిన జీహెచ్ఎంసీ
- వీధి దీపాలకు ఆగస్టు 3న టెండర్లు ఓపెన్
హైదరాబాద్ సిటీ, వెలుగు : క్యూర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో స్ట్రీట్‌లైట్ల నిర్వహణ పనులను జీహెచ్‌ఎంసీ స్పీడప్ చేసింది. గతేడాది అంతర్జాతీయ సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్వీకరించింది. ఓ వైపు ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానిస్తూనే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో రెండ్రోజుల క్రితం ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ఫిలిప్స్, క్రాంప్టన్, గ్రీవ్స్, బజాజ్ వంటి 25 అంతర్జాతీయ సంస్థలు హాజరై తమ టెక్నికల్ కెపాసిటీని వివరించాయి. టెండర్లలో పాల్గొనే సంస్థలకు విధివిధానాలను జీహెచ్ఎంసీ స్పష్టంగా వివరించింది.
98 శాతం లైట్లు వెలగాల్సిందే..
క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల్లో 7.61 లక్షల స్ట్రీట్‌లైట్లుండగా, వీటిలో 98 శాతం లైట్లు నిరంతరం వెలిగేలా చూడాలని సర్వీస్ లెవల్ అగ్రిమెంట్‌లో షరతుగా పేర్కొన్నారు. ఏ స్ట్రీట్‌లైట్ పనిచేయకపోయినా 24 గంటల్లో గుర్తించి రిపేర్చేయాల్సిందేనని, అందుకు తగిన మ్యాన్ పవర్, మెషినరీ ఉండాలని రూల్ పెట్టారు.
వెలిగే స్ట్రీట్‌లైట్లకే నిర్వహణ ఛార్జీలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. లీడ్ బిడ్డర్‌గా వ్యవహరించే సంస్థకు ఏడాదికి రూ.400 కోట్ల టర్నోవర్ ఉండాలని మెన్షన్ చేశారు. టెండర్లను వచ్చే నెల 3న ఓపెన్ చేసి అర్హత సాధించిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. 17నెలలుగా పెండింగ్ లో పడుతున్న ఈ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకుసాగుతుంది.
హైడ్రాలిక్ క్రేన్లు తప్పనిసరి
స్ట్రీట్‌లైట్ల రిపేర్లు స్పీడ్‌గా చేసేందుకు 60 హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చే బాధ్యతను కూడా కాంట్రాక్టర్‌కే అప్పగించారు. ముందుగా మూడు కార్పొరేషన్లకి సంబంధించి ప్రతి సర్కిల్‌కు ఒక్కటి చొప్పున 60 క్రేన్లు అందుబాటులో ఉంచాలని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో 30 క్రేన్లు సమకూర్చాలని ఏజెన్సీలకు సూచించారు. ప్రతి సర్కిల్‌కు ఇద్దరు ప్రత్యేక టెక్నీషియన్లను సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సిస్టమ్ నిర్వహణకు కేటాయించాలని షరతు విధించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 34,512 సీసీఎంఎస్ ప్యానెల్స్‌ను 6 నెలల్లో పూర్తిగా మార్చాలని, ప్రస్తుతమున్న 7.61 లక్షల స్ట్రీట్‌లైట్లన్నింటినీ రెండేండ్లలో ఎల్‌ఈడీ లైట్లుగా మార్చాలని టెండర్ షరతుల్లో పేర్కొన్నారు.
రూ.1,341.60 కోట్లతో పదేండ్ల ఒప్పందం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జీహెచ్ఎంసీ కాంప్రెన్సివ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.1,341.60 కోట్లు కాగా, టెండర్పొందిన కంపెనీ పదేండ్లు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ప్రతి ఏడాది దశలవారీగా ఈ నిధులను చెల్లించనున్నారు.
నోడల్ ఏజెన్సీగా జీహెచ్‌ఎంసీ చెల్లింపులు నిర్వహించనుండగా, ఎంఎంసీ, సీఎంసీలు తమ పరిధిలోని స్ట్రీట్‌లైట్ల నిర్వహణ వ్యయాన్ని జీహెచ్‌ఎంసీకి చెల్లించే విధంగా ప్రత్యేక విధివిధానాలు రూపొందించారు. పదేండ్ల పాటు క్యూర్ పరిధిలో జీహెచ్ఎంసీనే అంతా తానై చూసుకోనున్నది. మూడు కార్పొరేషన్లకి సంబంధించిన నిర్వహణ ఖర్చులను ఆయా కార్పొరేషన్లు చెల్లించాల్సి ఉంది.
