- పరిహారం తక్కువవుతోందని కోర్టుకు వెళ్లిన బాధితులు
- మళ్లీ నోటీసులు ఇచ్చి మాట్లాడాలన్న హైకోర్టు
- 10 మందికి నోటీసులు.. త్వరలోనే మరో 50 మందికి..
- టీడీఆర్ తీసుకునేందుకు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఓకే
హైదరాబాద్ సిటీ, వెలుగు :కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఎంత ప్రయత్నం చేస్తున్నా భూ బాధితులు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి ఒప్పుకోవడం లేదు. న్యాయం చేయాలని వారు కోర్టుకు వెళ్లడంతో కేసులు, భూసేకరణ అవసరం లేని చోట్ల జీహెచ్ఎంసీ పనులు మొదలుపెట్టింది. డెవలప్మెంట్అంశం కాబట్టి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి భూబాధితులకు నోటీసులిచ్చి మాట్లాడి చూడాలని చెప్పడంతో ఆ దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చింది. మరో 50 మందికి త్వరలో నోటీసులిచ్చి మాట్లాడేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇదే వేగంతో రానున్న 10 రోజుల్లో సుమారు50 ఆస్తుల సేకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది.
కోర్టుకు చేరడంతో...
కేబీఆర్‌చుట్టూ నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలకు 453 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, భూ యజమానుల అభ్యంతరాలు, న్యాయపరమైన వివాదాలతో ఇప్పటివరకు ఒక్క ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు గజానికి ప్రభుత్వ ధర రూ. 92వేలు ఉండగా, నగదు కావాలంటే రెండింతలు పరిహారం, అదే టీడీఆర్అయితే, నాలుగింతలు ఎక్కువగా ఇవ్వనున్నది. అయితే, బహిరంగా మార్కెట్ లో ఇక్కడ భూమి విలువ గజానికి రూ.10 లక్షల వరకు ఉంది. దీంతో తాము ఆ ధరకు భూములు ఇస్తే నష్టపోతామని, ఆస్తుల యజమానులు కొందరు కోర్టు తలుపు తట్టారు. అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం కావడంతో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి వారితో మాట్లాడి చూడాలని చెప్పింది. కోర్టు గైడ్‌లైన్స్ మేరకు అధికారులు బాధితులకు నోటీసులు ఇస్తూ మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
సరేనన్న జానారెడ్డి ..
బంజారాహిల్స్ఏరియాలో భూములు కోల్పోతున్న వారిలో కాంగ్రెస్సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉండడంతో ముందు ఆఫీసర్లు ఆయనతో చర్చించారు. నాలుగింతల టీడీఆర్(ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కు అంగీకరించడంతో జానారెడ్డితో పాటు ఆయన భార్య పేర్లపై ఉన్న 764 గజాల భూమిని త్వరలో జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోనున్నది. ఇదే తరహాలో మిగిలిన భూ యజమానులతోనూ టీడీఆర్, పరిహారం అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా మరికొందరు పెద్దలున్నారు. వీరికి ఇదివరకే నోటీసులు ఇచ్చినా కోర్టు ఆదేశాలతో మళ్లీ ఒకసారి ఇవ్వనున్నారు.
