‘జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ’లో 14 అంశాలకు ఆమోదం...

‘జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ’లో 14  అంశాలకు ఆమోదం...

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీస్​లో శనివారం స్పెషల్ ఆఫీసర్ జయేశ్​రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో  14  అంశాలకు ఆమోదం తెలిపారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గౌలిపురలో చిన్న జంతువుల వధశాల ఆధునీకరణకు రూ.5.69 కోట్ల పరిపాలనా అనుమతి, హైదర్‌‌‌‌షా కోట్‌‌‌‌లో సీసీ రోడ్లు, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల నిర్మాణానికి రూ.3.71 కోట్లు, బాలాపూర్ డివిజన్‌‌‌‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.65 కోట్లు ప్రతిపాదించారు. 

అలాగే, సంజీవయ్య పార్క్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు గతంలో మంజూరైన రూ.210 కోట్ల స్థానంలో రూ.152 కోట్ల ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కార్పొరేషన్‌‌‌‌కు సిఫారసు చేయాలని నిర్ణయించారు. 

పారిశుధ్య విభాగానికి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 నిధులతో రూ.4.95 కోట్ల వ్యయంతో కెపాసిటీకి తగిన కార్యక్రమాల నిర్వహణకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌గా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. ఐటీసీ లిమిటెడ్ వెల్‌‌‌‌బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ కార్యక్రమాన్ని జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అమలు చేయడానికి ఆమోదం కోరారు. 

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని పెట్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే పార్క్ తదితర సదుపాయాల నిర్వహణను రెండేండ్లపాటు సీఎస్సార్ కింద మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌‌‌‌కు అప్పగించే ప్రతిపాదనతోపాటు, జీహెచ్ఎంసీ అన్ని డిజిటల్ అప్లికేషన్లను మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌‌‌‌కు మార్చే అంశాన్ని కూడా చర్చించారు. 

3 కార్పొరేషన్లలో పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికుల కోసం మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ అమలుకు కొత్త టెండర్లు పిలవాలని ప్రతిపాదించారు. నగర రవాణా సౌకర్యాల మెరుగుదలకు సంబంధించి కిస్మత్‌‌‌‌పూర్, బండ్లగూడ జాగీర్, పెద్ద గోల్కొండ, శంషాబాద్ ప్రాంతాల్లో ప్రతిపాదిత రోడ్ల విస్తరణ కోసం వందలాది ఆస్తుల సేకరణకు సంబంధించిన నాలుగు కీలక ప్రతిపాదనలను కూడా స్టాండింగ్ కమిటీలో ఆమోదించారు.

‘ఎంఎంసీ’లో 32 అంశాలకు..

మల్కాజ్‌‌గిరి: మల్కాజ్‌‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) 6వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం తార్నాకలోని హెచ్‌‌ఎండీఏ కాంప్లెక్స్‌‌లో శనివారం నిర్వహించారు. ఎంఎంసీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్​రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన 32 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. 

2026–-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,586.67 కోట్ల బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. రూట్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి, ఆనంద్ నగర్ జంక్షన్ వద్ద 4 -లేన్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఖరారయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల ప్లాంట్, ఎలక్ట్రిక్ రోడ్ స్వీపింగ్ మెషీన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సమావేశంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతో, అడిషనల్​కమిషనర్లు రఘు ప్రసాద్, వేణుగోపాల్‌‌ తదితరులు పాల్గొన్నారు