స్ట్రీట్​ లైట్ల ఏజెన్సీ గడువు మరో రెండు నెలలు పొడిగింపు

స్ట్రీట్​ లైట్ల ఏజెన్సీ గడువు మరో రెండు నెలలు పొడిగింపు
  • రోడ్ల విస్తరణకు సంబంధించి 269 ఆస్తుల సేకరణకు ఆమోదం 
  • స్టాండింగ్​ కమిటీ సమావేశంలో 9 అంశాలకు ఓకే

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తొమ్మిది అంశాలు, రెండు టేబుల్ ఐటమ్స్​కు సభ్యులు ఆమోదం తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం బల్దియా హెడ్డాఫీసులో రెండో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. స్ట్రీట్ లైట్లకి సంబంధించి ఈఈఎస్ఎల్ ఏజెన్సీ నిర్వహణ కాంట్రాక్టు గత నెల30తో పూర్తయింది. కొత్త ఏజెన్సీ ఎంపికకు సమయం పట్టేలా ఉండడంతో మరో రెండు నెలల పాటు ఇదే ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. 

రాంకీకి గోపన్​పల్లిలో 4,350 గజాల స్థలం

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్​36 లో 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో బాంబో పార్కు అభివృద్ధి, నిర్వహణ, 5,373 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పార్కును సీఎస్ఆర్ కింద అభివృద్ధి, మెయింటెనెన్స్ కోసం అపోలో హాస్పిటల్ ఎంటర్​ప్రైజెస్​లిమిటెడ్​కు మూడేండ్ల పాటు అప్పగిస్తూ  ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఒప్పందం చేసుకునేందుకు ఆమోదించారు. గోపన్‌‌పల్లి లో రాంకీ ఫౌండేషన్ కు సీఎస్ఆర్ కింద జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణం, నిర్వహణ కోసం ఇప్పటికే కేటాయించిన 4,350 గజాల స్థలాన్ని  నామమాత్రపు రుసుముతో 25 ఏండ్లపాటు  లీజుకు అనుమతిస్తూ ఆమోదం తెలిపారు. 

ఖాజాగూడ జంక్షన్, ఐఐటీజంక్షన్, సైబరాబాద్ సీపీ ఆఫీస్ గచ్చిబౌలి వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేయడంతో పాటు మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం, అంజయ్య నగర్ నుంచి రాంకీ టవర్ రోడ్డు వరకు 150 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.749 కోట్ల ప్రాజెక్ట్ కోసం ఈపీసీ  కింద టెండర్లు పిలవడానికి అనుమతి కోసం ఆమోదించారు.

కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–-2కు సంబంధించి బండ్లగూడ క్రాస్ రోడ్డు నఫీస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి రాయల్ స్టీల్ ట్రేడర్స్ వరకు పైప్ లైన్ మార్చడానికి, బండ్లగూడ హౌసింగ్ కాలనీ నుంచి ఎర్రగుంట వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, యుటిలిటీ మార్చేందుకు  రూ. 2.12 కోట్లకు పరిపాలన మంజూరుకు ఆమోదం తెలిపారు. వివిధ ప్రాంతాల్లో  రోడ్ల విస్తరణకి సంబంధించి 269 ఆస్తుల సేకరణకు ఆమోదించారు.  

ఆదాయంపై దృష్టి పెట్టండి: మేయర్​

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ  జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలన్నారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆయా విభాగాలకు సంబంధించిన టెండర్లు తదితర నిర్ణయాలన్నింటినీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. బల్దియాకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికంగా నిధులు ఇచ్చినందుకు స్టాండింగ్ కమిటీ సభ్యులు కృతజ్జతలు తెలిపారు. 

జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాతా జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సి.ఎన్.రెడ్డి, ఎండీ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప పాల్గొన్నారు.