హోం గార్డు ఫ్యామిలీకి ..రూ.కోటి పరిహారం ఇవ్వండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి

హోం గార్డు ఫ్యామిలీకి ..రూ.కోటి పరిహారం ఇవ్వండి :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే లాస్య నందితా కారు కిందపడి చనిపోయిన హోం గార్డు నవ కిషోర్‌‌‌‌ ఫ్యామిలీకి ఆ పార్టీ రూ.కోటి ఎక్స్‌‌గ్రేషియా చెల్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదన్నారు. వందల కార్లతో ర్యాలీలు పెట్టి ఓ నిరుపేద హోంగార్డు ప్రాణం తీయడం ఎంత వరకు సబబని బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. దేశంలోనే అత్యధికంగా రూ.900 కోట్ల పార్టీ ఫండ్ కలిగిన బీఆర్ఎస్ పార్టీకి కోటి రుపాయలు పెద్ద లెక్క కాదన్నారు. అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చు పెట్టి.. 30 వేల మందితో నల్గొండలో సభ పెట్టి.. అబద్ధాలు, అసత్యాలు చెప్పి ప్రజలను ఆగం చేయడం తగదని హితవు పలికారు. అనంతరం చనిపోయిన హోం గార్డు కుటుంబానికి మంత్రి రూ.2 లక్షలు అందజేశారు. 

ప్రభుత్వం తరఫున ఆయన భార్యకు ఉద్యోగం, వారి పిల్లల చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. జీవో నంబర్‌‌‌‌ 46 తెచ్చి నల్గొండ యువత పొట్టగొట్టిన కేసీఆర్ అక్కడే సభ పెట్టి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ తమ స్వార్థ రాజకీయాలకు అమాయకులను బలి తీసుకోవడం మానుకోవాలన్నారు. సభలో చెప్పాల్సిన విషయాలను పబ్లిక్‌‌ మీటింగ్‌‌లో కేసీఆర్ చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. సభకు రావాలని ప్రభుత్వం కోరుతున్నా కేసీఆర్‌‌‌‌ నుంచి స్పందన లేకపోవడం ఆయన దొరతనానికి నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.