- వికసిత్ భారత్ సాధనలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి కీలకం: మోదీ
- యువత, మహిళల సాధికారతతోనే దేశ భవిష్యత్తు బలపడుతుంది
- నీతి ఆయోగ్ సమావేశం అనంతరం పలువురు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఆయన అధ్యక్షతన నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, ఆలోచనల మార్పిడి పెరగాలని, అందుకు నీతి ఆయోగ్ కీలక వేదికగా నిలుస్తుందని చెప్పారు.
యువత దేశానికి పెద్ద ఆస్తి
సమగ్ర మానవాభివృద్ధి కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మౌలిక మానవ వనరుల అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అవసరమైన స్కిల్స్, ఉపాధి కల్పన, వ్యవస్థాపకత, ఆరోగ్యం, పోషకాహారం, సామాజిక సమానత్వం వంటివి ఎజెండాలో ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, వాటి ద్వారా ఎగుమతులు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు లభిస్తాయని మోదీ తెలిపారు.
ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుని ప్రపంచ మార్కెట్లలో తమ స్థానం బలపరుచుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దేశానికి లభించిన యువత ఒక చారిత్రక అవకాశమని, నాణ్యమైన విద్య, డిమాండ్‌కు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు.
మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి వికసిత్ భారత్‌కు మూలస్తంభమని పేర్కొంటూ విద్య, నైపుణ్యాభివృద్ధి, భద్రత, సాధికారతకు రాష్ట్రాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.కాగా, సమావేశం అనంతరం ప్రధాని మోదీతో పలు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం విజయ్, ఇతర సీఎంలు పీఎంను కలిశారు.
రైతు సంక్షేమానికే ప్రాధాన్యం
దేశ ఆహార భద్రత, పోషకాహారం, ఆర్థికాభివృద్ధికి రైతులే వెన్నెముక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతుల జీవితాలను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధాని తెలిపినట్టు గురువారం పీఎంవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సంక్షేమం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటన్నారు. పీఎం -కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయానికి భరోసా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు.
