జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ విమానాశ్రయం (హైదరాబాద్) నుంచి నేరుగా ఫ్రాంక్‌ఫర్ట్(జర్మనీ)కు విమాన సర్వీసులు నడిపేందుకు సర్వం సిద్ధమైంది. అందుకోసం హైదరాబాద్ విమానాశ్రయం యూరోపియన్ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మార్గాల్లో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ద్వారా నాన్‌స్టాప్ సర్వీస్‌లు నడపనున్నారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో విమానాలు అందుబాటులో ఉండనుండగా, హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉండనున్నాయి.
జనవరి 16, 2024న తొలి సర్వీస్..
ఈ మార్గంలో తొలి విమానం 2024, జనవరి 16న ప్రారంభం కానుంది. జనవరి 16న ఉదయం 10 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బయలుదేరి, రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు హైదరాబాద్ నుండి బయల్దేరి, ఉదయం 6:10 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకోనుంది. మొత్తం 8 గంటల 30 నిమిషాల పాటు ఈ ప్రయాణం కొనసాగనుంది. విమానం మధ్యలో ఎక్కడా ఆగదు కాబట్టి, ప్రయాణికుల కోసం విశాలంగా ఉండేందుకు బోయింగ్ B787-9 విమానాన్ని ఈ మార్గంలో నడపనున్నారు. ఇందులో 26 బిజినెస్ క్లాస్ సీట్లు, 21 ప్రీమియం ఎకానమీ సీట్లు, 247 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
