తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖామంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2026–27 వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు.. సంక్షేమ పథకాలతో 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించారు.
పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరిగే గోదావరి పుష్కరాలు తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. ఈరోజుల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 'కుంభమేళా' తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. ..
తెలంగాణను ఆధ్యాత్మికంగా పర్యాట రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేవాదాయ శాఖ... తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించింది. ఈ యాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేశమని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు..
