హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ, మెట్రోకు ఒకటే టికెట్ !

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ, మెట్రోకు ఒకటే టికెట్ !
  • కామన్ యాప్ తేవాలని అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మెట్రో, ఆర్టీసీలాంటి ప్రజా రవాణా వ్యవస్థలన్నింటిలోనూ ఒకే టికెట్‌‌‌‌పై ప్రయాణించే కామన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్‌‌‌‌ సంజయ్ జాజు  ఆదేశించారు. దీనికోసం టీజీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చించి ఒక ఉమ్మడి యాప్‌‌‌‌ను అభివృద్ధి చేయాలని, అలాగే ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేలా మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌‌‌‌లను ప్రవేశపెట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు.

శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో జరిగిన హెచ్ఎంఆర్ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల సమావేశానికి ఆయన తొలిసారిగా చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి మెట్రో నిర్వహణ, అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌‌‌‌ మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అదనపు బోగీలు తొందరగా తెప్పించండి 
మెట్రో మొదటి దశ స్వాధీనం ప్రక్రియతో పాటు రెండో దశ విస్తరణకు సంబంధించిన అనుమతుల తాజా ప్రగతిపై సీఎస్  చర్చించారు. మెట్రోలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు అదనపు బోగీలను వీలైనంత త్వరగా సమీకరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.