దేశంలో ప్రజలు రోజూ చెల్లింపుల కోసం వాడే కరెన్సీ నోట్లు త్వరలోనే ఒక సరికొత్త రూపంలోకి మారబోతున్నాయి. ఇప్పటివరకు మనం వాడుతున్న కాటన్ పేపర్ నోట్ల స్థానంలో ‘పాలిమర్’ అంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నాయని, దీనికి ఉన్న లాభనష్టాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
దేశంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితం.. అంటే 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 నగరాల్లో (కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్) ట్రయల్ రన్ కింద 10 రూపాయల పాలిమర్ నోట్లను దాదాపు 100 కోట్ల సంఖ్యలో చలామణిలోకి తీసుకురావాలని ప్లాన్ చేసింది. అయితే అప్పట్లో కొన్ని సాంకేతిక కారణాలు, సవాళ్ల వల్ల ఆ ప్రాజెక్టును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఆర్బీఐ మరోసారి ఈ ప్లాస్టిక్ నోట్లపై ఫోకస్ పెట్టింది. ఒకవేళ అంతా సవ్యంగా సాగితే రాబోయే రోజుల్లో దశలవారీగా ఈ ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అసలు ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి చూడటానికి, పట్టుకోవడానికి సాధారణ కాగితం నోట్లలాగే చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. కానీ ఇవి సన్నని ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవుతాయి. దీనివల్ల ఈ నోట్లకు మురికి అంటదు, తడిచినా పాడవువు, ఈజీగా చిరిగిపోవు. సాధారణ కాగితం నోట్లతో పోలిస్తే ఇవి చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయి. వీటన్నింటికీ మించి ప్లాస్టిక్ నోట్లను నకిలీలుగా సృష్టించడం దాదాపు అసాధ్యం. అత్యంత అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను వీటిలో పొందుపరచడం సాధ్యమవుతుంది కాబట్టి నకిలీ నోట్ల ముఠాలకు ఇది పెద్ద చెక్ కానుంది.
ప్రస్తుతం దేశంలో యూపీఐ, డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయిలో పెరిగినప్పటికీ, నగదు నోట్లకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చిన్న నోట్లయిన రూ.10, రూ.20, రూ.50 నోట్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. గడిచిన ఏడాది కాలంలోనే దేశంలో కరెన్సీ చలామణి 11.5 శాతం పెరిగి మే 15 నాటికి రికార్డు స్థాయిలో రూ.42.86 ట్రిలియన్లకు చేరింది. చిన్న నోట్లతో పాటు నాణేల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. దీంతో చిన్న నోట్లు త్వరగా పాడైపోకుండా, ఎక్కువ కాలం మన్నేలా చేయడానికి ప్లాస్టిక్ నోట్లే సరైన ప్రత్యామ్నాయమని ఆర్బీఐ భావిస్తోంది. సాంకేతిక సవాళ్లను అధిగమించి ఈసారి ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా మార్కెట్లోకి తెస్తారో లేదో చూడాలి.
ALSO READ : విచ్చలవిడి ఏఐ వాడకంతో కరెంట్, నీటి కష్టాలు..
ప్రింటింగ్ స్టార్ట్ అయ్యిందా..?
ఇదిలా ఉంటే గతంలో మోడీ సర్కార్ డీమానిటైజేషన్ తో పాత కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ముందుగానే ప్రభుత్వం నోట్ల ముద్రణను సీక్రెట్ గా స్టార్ట్ చేసి హఠాత్తుగా నోట్ల రద్దును ప్రకటించింది. సరిగ్గా అదే తరహాలో ఇప్పటికే ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ముద్రణ కూడా మెుదలైందేమో అనే అనుమానాలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం ఇటు రిజర్వు బ్యాంక్ నుంచి వస్తున్న సంకేతాలు చూస్తుంటే ఇప్పటికే ప్రింటింగ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చని.. కొత్త కరెన్సీ నోట్లు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. పోయినసారి జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా ప్రజలందరికీ సజావుగా ప్లాస్టిక్ కరెన్సీ చేరేలా ఏర్పాట్లు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.
