ప్రపంచాన్ని ప్రస్తుతం ఏఐ వేగంగా మార్చేస్తోంది. భవిష్యత్తులో ఏఐ మోడల్స్ మరింత సమర్థవంతంగా మారి తక్కువ ఎనర్జీని వినియోగిస్తాయని.. దాంతో పర్యావరణానికి ముప్పు తప్పుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక పెద్ద భ్రమ అని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. సాంకేతికత పెరిగేకొద్దీ వనరుల వినియోగం తగ్గకపోగా.. మరింత పెరుగుతుందనే ఆర్థిక సూత్రం ‘జెవాన్స్ పారడాక్స్’ ఉచ్చులో ఏఐ చిక్కుకుందని ఐరాస స్పష్టం చేసింది. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో బొగ్గు వాడకంపై ఆర్థికవేత్త విలియం స్టాన్లీ జెవాన్స్ చెప్పిన ఈ సిద్ధాంతం.. ఇప్పుడు ఏఐకి కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఏఐ చౌకగా ఆకర్షణీయంగా మారే కొద్దీ దాని వాడకం విపరీతంగా పెరిగి, పర్యావరణాన్ని ముంచేస్తుందని హెచ్చరించింది.
2030 నాటికి ప్రళయం:
రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏఐ వల్ల పర్యావరణానికి జరగబోయే నష్టం ఊహాతీతమని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ మోడల్స్, డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం రెట్టింపై ప్రపంచ మొత్తం విద్యుత్‌లో 3 శాతానికి చేరుకుంటుందట. గత ఏడాదిలోనే ఇవి సౌదీ అరేబియా దేశం మొత్తం వాడే విద్యుత్ అంత పవర్‌ను మింగేశాయి. ఇక ఏఐ విడుదల చేసే కార్బన్ ఉద్గారాలను సమం చేయాలంటే 6.7 బిలియన్ల చెట్లను నాటి, పదేళ్ల పాటు పెంచాల్సి ఉంటుందట. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ దేశం విడుదల చేసే మొత్తం ఉద్గారాలతో సమానం. అలాగే డేటా సెంటర్లను చల్లబరచడానికి ఏకంగా 9.3 ట్రిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది ప్రపంచ జనాభా మొత్తానికి ఏడాది పాటు అవసరమయ్యే తాగునీటి కంటే ఎక్కువనే. ఈ డేటా సెంటర్ల కోసం మెక్సికో సిటీ కంటే 10 రెట్లు పెద్దదైన స్థలం అవసరమవుతుందని రిపోర్ట్ బయటపెట్టింది.
ఏఐ బూమ్ లో దాగి ఉన్న వివక్ష..
ఈ ఏఐ విప్లవం వెనుక తీవ్రమైన అంతర్జాతీయ వివక్ష దాగి ఉందని ఐరాస వేలెత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 32 దేశాల్లో మాత్రమే ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అందులోనూ 90 శాతం సామర్థ్యం కేవలం అమెరికా, చైనాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఏఐ సాంకేతికతను సృష్టించి, శాసించే దేశాలు ఒకవైపు ఉంటే.. కేవలం వాటిని వాడుకునే పేద దేశాలు మరోవైపు ఉన్నాయి. అయితే ఈ ఏఐ తయారీకి కావాల్సిన మైనింగ్, ఈ-వేస్ట్ వంటి పర్యావరణ భారాలన్నింటినీ ఈ పేద దేశాలే మోయాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
సస్టైనబుల్ టెక్నాలజీ అలసరం..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు తమ ప్రభుత్వ సేవల్లో ఏఐ వాడకాన్ని పెంచుతున్నప్పటికీ.. పర్యావరణ పరిణామాలపై స్పష్టమైన నిబంధనలు, పర్యవేక్షణ లేదు. టెక్నాలజీ బాగుంది కదా అని ప్రకృతిని పణంగా పెట్టలేం. కాబట్టి ఇప్పటికైనా పారదర్శకత, గ్లోబల్ కోఆపరేషన్, సస్టైనబుల్ యూజ్ అనే సూత్రాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ఐరాస ప్రతిపాదించింది. ఏఐ వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని అధికారికంగా వెల్లడించే విధానాన్ని ప్రతీ దేశం తీసుకురావాలని, ప్రకృతిని కేంద్ర బిందువుగా చేసుకుని సరికొత్త 'ఇన్నోవేషన్ ప్లేబుక్' రాయాల్సిన సమయం ఆసన్నమైందని యునైటెడ్ నేషన్స్ పిలుపునిచ్చింది.
