గూగుల్‌ కెమెరా వాచ్‌

గూగుల్‌ కెమెరా వాచ్‌

టిక్​టిక్​మంటూ క్షణక్షణం టైం చూపిస్తుంటది వాచ్​. అదే వాచ్​ క్లిక్​క్లిక్​మంటూ ఫొటోలూ తీసేస్తే ఎట్లుంటది? సూపర్​ కదూ! గూగుల్​ అలాంటి ఓ కెమెరా వాచ్​ను తయారు చేసింది. నిజానికి 2017లోనే దీనిపై వార్తలు వచ్చినా, పోయినేడాది ఆ వాచ్​ గురించి చెప్పాలనుకున్నా కుదర్లేదు. కానీ, ఈ సారి మాత్రం ఆ కెమెరా వాచ్​ పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వాచ్​ కోసం కంపెనీ  అమెరికాలో పేటెంట్​ కోసం దరఖాస్తు చేసుకుంది. జులై 2017లోనే దరఖాస్తు చేసుకున్నా ఈ నెల 27న ఆ పేటెంట్​ అప్లికేషన్​ను జనానికి అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది.

జస్ట్​ ‘కెమెరా వాచ్​’ అన్న పేరుతోనే ఓ ఏడు డయాగ్రమ్​లను అందులో చూపించింది. అయితే, అసలు డిజైన్​ను మాత్రం వెల్లడించలేదు. మరి, ఆ వాచ్​కు పేటెంట్ వచ్చిందా.. రాలేదా అన్నది మాత్రం తెలియలేదు. చిన్నచిన్న కంపెనీల స్మార్ట్​వాచ్​లలో కెమెరాలు ఉన్నప్పటికీ యాపిల్​, శాంసంగ్​ వంటి స్మార్ట్​వాచ్​లలో లేవు. కెమెరాతో స్మార్ట్​ వాచ్​ తెస్తున్న మొదటి పెద్ద కంపెనీ గూగుల్​ కావడం విశేషం. గూగుల్​ పిక్సెల్​ 3, పిక్సెల్​ 3 ఎక్స్​ఎల్​లో వాడిన కెమెరాను ఈ స్మార్ట్​వాచ్​లో వాడుతున్నట్టు సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్​ చేసుకోవడం వంటి వాటికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.