ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో రెడ్ టెర్రరిజం లేకుండా చేశామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టుల లొంగుబాటుపై లోక్ సభలో మాట్లాడిన ఆయన.. మోదీ పాలనలో నక్సలిజాన్ని అంతం చేశామన్నారు. దేశంలో నక్సలిజం ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం భద్రతా దళాల సిబ్బంది, రాష్ట్ర పోలీసు బలగాలు , స్థానిక గిరిజన వర్గాలే కారణమన్నారు. ఎవరైనా ఆయుధాలు పడితే వారి అంతు చూస్తామని హెచ్చరించారు అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం అన్ని సమస్యలను వినడానికి వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు.
మావోయిస్టు హింసతో దేశంలో ఎంతో నష్టం జరిగిందన్నారు అమిత్ షా. తెలంగాణ, ఏపీ ,చత్తీస్ ఘడ్,కేరళ, జార్ఖండ్,యూపీతో రెడ్ కారిడార్ ఉండేదని..రెడ్ కారిడార్‌లో శాంతిభద్రతలు పూర్తిగాదెబ్బతిన్నాయన్నారు. దీనివల్ల సుమారు 12 కోట్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారని అన్నారు. వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు..దాదాపు వేల మంది యువకులు హత్యకు గురయ్యారని చెప్పారు. మోదీ సర్కార్ వచ్చాక మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందన్నారు. మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ ను మారుస్తున్నామని చెప్పారు. గత పాలకులు వామపక్ష భావజాలం ప్రోత్సహించారని తెలిపారు. 11 ఏళ్ల మోదీ పాలనలో నక్సలిజాన్ని అంతం చేశామని చెప్పారు. దేశంలో రెడ్ టెర్రరిజం లేకుండా చేశామన్నారు.
వికసిత్ భారత్ కు కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు అమిత్ షా. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందడం కొందరికి ఇష్టం లేదని విమర్శించారు. మావోయిస్టు ప్రాంతంగా బస్తర్ ను మార్చామన్నారు. ఆయుధాలు వీడని మావోయిస్టుల అంతు చూస్తామని హెచ్చరించారు. మావోల దాడిలో చనిపోయిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించాలన్నారు. ప్రజల మద్దతుతోనే మావోయిస్టులపై పోరాటంలో గెలిచామన్నారు. అన్యాయంగా ప్రజలను చంపేవారికి సహకరించొద్దని సూచించారు అమిత్ షా.
