
మౌంటెన్ వ్యూ బేస్డ్ కంపెనీలో 13 ఏళ్లపాటు పనిచేసిన న్యూస్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ డైరెక్టర్ మాధవ్ చిన్నప్పను గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా మాధవ్ తన సహచరులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ చేశారు. గూగుల్‌లో తాను గడిపిన సమయం గురించి రాసుకొచ్చిన ఆయన.. గూగుల్‌లో తన పని గురించి, మరి కొన్ని ముఖ్యాంశాలను కూడా పోస్టులో చర్చించాడు. మాధవ్ గూగుల్‌లో పని చేయడానికి ముందు, BBCలో బిజినెస్ డెవలప్మెంట్ & రైట్స్ హెడ్‌గా ఉన్నారు.
"నేను ప్రస్తుతం గార్డెనింగ్ సెలవులో ఉన్నాను. ఇది పని, వృత్తి, జీవితం మొదలైన వాటి గురించి ఆలోచించడానికి చాలా సమయాన్ని అందిస్తుంది. ఇక Google గురించి చెప్పాలంటే అందులో దాదాపు 13 సంవత్సరాల పాటు నేను పని చేశానని చెప్పుకునేందుకు గర్విస్తున్నానని చెప్పారు.
ఇక తాను ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నానని, తనకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని ఈ సందర్భంగా మాధవ్ చెప్పారు. భారత్ వెళ్లి అమ్మను చూసుకోవాలన్నారు. నెల రోజుల ముందే తాను సంస్థను విడిచిపెడుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2వరకు మిగిలిన పనులు పూర్తి చేస్తానని మాధవ్ చెప్పారు.
గూగుల్ ఈ ఏడాది జనవరిలో దాదాపు 12వేల మందిని తొలగించింది. ఆ తర్వాత కంపెనీ మళ్లీ తన మ్యాపింగ్ యాప్ వేజ్ లో భాగంగా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అప్పట్నుంచి గూగుల్ లో తొలగించబడిన, ప్రభావితమైన వారి కథనాలు ఇలా సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే ఉన్నాయి.