ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్

ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్
  • పార్టీ లైన్ దాటాడంటూ రాజాసింగ్ పై బీజేపీ వేటు 
  • 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు

గోషామహాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ పై అధిష్టానం వేటు వేసింది. బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మునావర్ షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను వ్యతిరేకించినా.. షో నిర్వహించారని యూట్యూబ్ లో రాజాసింగ్ వీడియో విడుదల చేశాడు.

అయితే ఈ వీడియోలోని కామెంట్స్ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులతో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ రాజాసింగ్ పై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది.

రాత్రి నుంచి సిటీలో ఆందోళనలు.. ఉదయమే రాజాసింగ్ అరెస్ట్ 

ఎమ్మెల్యే రాజాసింగ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ఇవాళ ఉదయమే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. 

అరెస్టును వ్యతిరేకించిన రాజాసింగ్

తనను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని.. తిట్టే వారికే విలువ ఉందని మండిపడ్డారు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఏర్పాటు చేసి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని రాజా సింగ్ చెప్పారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని‌ హెచ్చరించినా.. షో ప్రదర్శించారని గుర్తు చేశారు.

దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదని, రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. మునావర్ ఫారూఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానని.. రెండో భాగానికి సంబంధించిన వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాననని రాజాసింగ్ వెల్లడించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని.. తనపై ఎలాంటి చర్యలకు దిగిన తాను రెడీ అని రాజాసింగ్  చెప్పారు.