వీఐకి బూస్ట్..కిస్తీల్లో బకాయిల చెల్లింపుకు కేంద్రం గ్రీన్సిగ్నల్

వీఐకి బూస్ట్..కిస్తీల్లో బకాయిల చెల్లింపుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
  • ఏటా రూ.124 కోట్లు కట్టాలి
  • కేంద్రం గ్రీన్​సిగ్నల్​

న్యూఢిల్లీ: భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెల్కో వోడాఫోన్ ఐడియా (వీఐ) కేంద్రం ఆక్సిజన్​అందించింది. అడ్జస్టెడ్ ​గ్రాస్​ రెవెన్యూ (ఏజీఆర్​) బకాయిలను వాయిదా పద్ధతిలో తీర్చేందుకు అనుమతించింది. ఆరేళ్లపాటు  వార్షిక చెల్లింపులపై రూ.124 కోట్ల పరిమితిని విధించింది.  దీనివల్ల కంపెనీ క్యాష్​ఫ్లో మెరుగుపడుతుంది. 

వీఐ ఏజీఆర్​ బకాయిలను రూ.87,695 కోట్లుగా ఖరారు చేసింది. 2017 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలను 2025 నుంచి 2031 వరకు ఎటువంటి మార్పు లేకుండా చెల్లించాలి. ఇవి ఏడాదికి రూ.124 కోట్ల వరకు ఉంటాయి. 2032–2035 మధ్య వార్షిక చెల్లింపులను రూ.100 కోట్లకు తగ్గించింది.  మిగిలిన మొత్తాన్ని 2036 మార్చి నుంచి ఆరేళ్లు వాయిదాల్లో చెల్లించాలి.

కేంద్రం గత ఏడాది డిసెంబరులో వీఐ  ఏజీఆర్​ బకాయిలపై పాక్షికంగా మారటోరియం విధించింది. ఈ మొత్తాన్ని 2031 నుంచి 2041 మధ్య  చెల్లించాలి.  అయితే ఆడిట్ ఆధారంగా ఒక ప్రత్యేక కమిటీ ఈ బకాయిలను తిరిగి అంచనా వేస్తుంది.  బీఎస్​ఈలో కంపెనీ షేరు ధర శుక్రవారం రెండు శాతం తగ్గి రూ.11.27 వద్ద ముగిసింది.

ఇవీ కారణాలు..

కేంద్రానికి వీఐలో 48.9 శాతం వాటా ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడటంతో పాటు స్పెక్ట్రం వేలం ఫీజులు, ఏజీఆర్ బకాయిలను వసూలు చేయడం కోసం ఈ వెసులుబాటు ఇచ్చింది. టెలికాం రంగంలో పోటీని కొనసాగించడం, 20 కోట్ల మంది వీఐ కస్టమర్ల ప్రయోజనాలను రక్షించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. టెల్కోలు ప్రభుత్వం నుంచి పొందిన ఆదాయం ఆధారంగా చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజును, స్పెక్ట్రం వినియోగ ఫీజులను ఏజీఆర్ బకాయిలు అంటారు.  

వడ్డీలు, అద్దెలు, ఆస్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ఏజీఆర్​ చెల్లించాలి.  ఇతర కంపెనీలతో ధరల పోటీ, భారీ అప్పులు, ఏజీఆర్ బకాయిల వల్ల వీఐ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కస్టమర్లు తగ్గడం, నెట్‌‌వర్క్ విస్తరణలో వెనుకబడటం వల్ల నష్టాల్లో కొనసాగుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్లు కంపెనీని నిలబెడుతున్నాయి.  

ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోతే కంపెనీ 2026 మార్చి నాటికి రూ.18 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చేది.  వీఐ మొత్తం అప్పులు రూ.రెండు లక్షల కోట్లు కాగా, వీటిలో స్పెక్ట్రం బకాయిలే రూ.1.19 లక్షల కోట్లు.