
ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ అప్పీల్పై ప్రభుత్వ వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఫాం హౌస్ లో జరిగిన ట్రాప్, తదనంతర పరిణామాలను కోర్టుకు వివరించారు. అనంతరం రోహిత్ రెడ్డి, ప్రతిపాదిత నిందితుడు తుషార్ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. రేపటి విచారణలో ఒక దవే మినహా మిగిలిన ప్రతివాదుల వాదనలు పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దుష్యంత్ దవే.. రిట్ పిటిషన్ విచారణ అర్హతపై డివిజన్ బెంచ్కు వివరించారు. 2022 అక్టోబర్ 26న నేరం జరిగితే నవంబర్ 3న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు నమోదు చేసిన రోజు నుంచి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ కేసులో సింగిల్ బెంచ్ కేవలం రెండు జడ్జిమెంట్లను పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వడం సరికాదని అన్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో ట్రాప్ చేసిన తీరును దవే ధర్మాసనానికి వివరించారు. ట్రాప్ ను గతంలో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని దుష్యంత్ దవే కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ ట్రాప్ చేయకపోతే వాళ్ల ఆఫర్లు, బెదిరింపులకు సాక్ష్యాలు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు.
అనంతరం రోహిత్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రికి తన క్లయింటే సీడి ఇచ్చాడని చెప్పారు. లీకేజీపై బీజేపీ కోర్టు దృష్టికి తెచ్చినా సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వానికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఒకవేళ కౌంటర్ దాఖలుకు అనుమతిస్తే క్లారిటీ వచ్చేదని అన్నారు. సీబీఐకు అప్పగించాలన్న సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును తప్పుబట్టిన గండ్ర మోహన్ రావు..నిందితులకు దర్యాప్తు సంస్థను ఎంచుకునే అధికారం ఉందా అని ప్రశ్నించారు.
ప్రతిపాదిత నిందితుడైన తుషార్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ సంజయ్ సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్త సంస్థ తప్ప ఏ పార్టీకి కొమ్ము కాయదని అన్నారు. కానీ సిట్ లో ఉన్న అధికారుల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు, పోస్టింగ్ లను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. సీఎం ఆధారాలు బయటపెట్టిన తర్వాతే పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాయని న్యాయమూర్తికి వివరించారు. నేరం రుజువుకాకముందే ముఖ్యమంత్రి కొందరిని నిందితులుగా ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించారు.