ఏసీ బస్​షెల్టర్లను పట్టించుకోవట్లే

ఏసీ బస్​షెల్టర్లను పట్టించుకోవట్లే
  • మెయింటెనెన్స్ లేక పాడైపోయిన ఏసీలు
  • బస్సుల కోసం ఎండలోనే నిలబడుతున్న ప్యాసింజర్లు  
  • టాయిలెట్లకు తాళాలు.. పని చేయని సీసీ కెమెరాలు
  • మాదాపూర్​లో షెల్టర్​ను ఆక్రమించి రెస్టారెంట్ ​ఏర్పాటు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ శిల్పారామం ఎదురుగా ‘సంప్రదాయ రుచుల వైభోగం’ అంటూ ఓ రెస్టారెంట్​ఉంది. ఆ రెస్టారెంట్​లో కస్టమర్ల కన్నా,  ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూసే ప్యాసింజర్లే ఎక్కువగా కనిపిస్తారు.   రెస్టారెంట్​లో ప్యాసింజర్లు ఏంటని అనుకుంటున్నారా?.. వాస్తవానికి అది ఆధునిక హంగులున్న మాదాపూర్​ ఏసీ బస్​ షెల్టర్.  2018 జూన్​లో మంత్రి కేటీఆర్​దాన్ని ప్రారంభించారు. కానీ  కేటీఆర్​ దగ్గర పని చేసే ఓ వ్యక్తి తమకు  క్లోజ్ ​అంటూ కొందరు 3 నెలల క్రితం దాన్ని ఏసీ రెస్టారెంట్​గా మార్చి వాడేస్తున్నారు. అది బస్​షెల్టర్​ అని తెలియని చాలామంది రెస్టారెంట్​అనుకుంటూ  బయట ఎండలోనే బస్సు​కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ఏసీ బస్ షెల్టర్ ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడుతోంది.  

అన్ని ఫెసిలిటీస్​తో ఆర్భాటంగా..
మాదాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, సోమాజిగూడ, తార్నాక, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం.. ఇలా మొత్తం 8  ప్రాంతాల్లో బల్దియా, ప్రైవేటు ఏజెన్సీల సహకారంతో ఏసీ బస్టాప్​లను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారి అంటూ ఆర్భాటంగా ప్రారంభించింది.  ఏసీలు,  వైఫై, సీసీ కెమెరాలు, టాయిలెట్స్​, ఏటీఎం, కూల్​డ్రింక్స్​, కాఫీ మెషీన్​, చార్జింగ్​ పాయిట్స్​, బస్​ పాస్​ కౌంటర్లు  అన్నీ పెట్టారు, బేబీ ఫీడింగ్​ రూమ్స్​ కూడా ఏర్పాటు చేశారు. కానీ  ప్రారంభించిన రోజు అధికారులు చేసిన హంగామా అంతా మూడ్రోజుల ముచ్చటే అయ్యింది.  కొన్ని రోజులకే ఏసీలన్నీ పాడైపోయినా పట్టించుకోలేదు.

నిరుపయోగంగా మారినయ్.. 
ప్రస్తుతం సిటీలో ఏసీ బస్టాప్​లు నిరపయోగంగా  మారాయి.  అద్దాలతో పూర్తిగా క్లోజ్​ చేసిన ఆ సెంటర్లలో ఏసీలు పని చేస్తలే. దీంతో లోపల  ఉక్కపోత భరించలేక ప్యాసింజర్లు బయటకు వచ్చి ఎండలోనే  బస్సు కోసం వేచి చూస్తున్నరు.  కొన్ని బస్టాప్​లకు కరెంట్​ ఫెసిలిటీ లేదు. ప్యాసింజర్ల సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు డెకరేషన్ కోసమే అన్నట్లుగా మారాయి.  వైఫై పనిచేయడం లేదు. టాయిలెట్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి.  బేబీ ఫీడింగ్​ రూమ్​లు నామ్​కే వాస్తేగా ఉన్నాయి.  ఓపెనింగ్​ ఘనంగా చేసినా.. నిర్వహణ మాత్రం  సక్కగ లేక ఏసీ బస్ షెల్టర్లు ఇట్లా  నిరుపయోగంగా మారుతున్నాయి.   

ఇల్లీగల్​ యాక్టివిటీస్​కు అడ్డాగా...
ఏసీ బస్టాప్​లు ఇల్లీగల్ యాక్టివిటీస్​కు అడ్డాగా మారుతున్నాయి,  బస్​ షెల్టర్లలోకి ప్యాసింజర్లు ఎవరూ రాకపోవడంతో  రాత్రి పూట మందుబాబులు అక్కడికి చేరుతున్నారు. ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణను బల్దియా అధికారులు రెండు, మూడు ఏజెన్సీలకు అప్పగించారు. ఏజెన్సీలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. వేసవి కావడంతో ఏసీ బస్ షెల్టర్లను బాగు చేసి అన్ని ఫెసిలిటీస్​ను సరిగా ఉండేలా చూడాలని ప్యాసింజర్లు కోరుతున్నారు.   

ఏసీలను రిపేర్ చేయించాలె
డైలీ మాదాపూర్ నుంచి అమీర్ పేటలో ఉన్న ఆఫీసుకి బస్సులోనే వెళ్తాను.  బస్టాప్​లో ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోత వల్ల లోపల కూర్చోలేకపోతున్నాం. ఎండలోనే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్టాప్​ వద్ద  టాయిలెట్లకు తాళం​ వేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అధికారులు వెంటనే బస్టాప్​లలో ఏసీలను రిపేర్ చేయించి అవి  పని చేసేలా చూడాలి.
- రాణి, ప్రైవేటు ఎంప్లాయ్, మాదాపూర్