- ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్
- మొండికుంట చెరువు చుట్టూ ఆక్రమణల తొలగింపు
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ కారిడార్లో గురువారం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు స్థలం, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన వందలాది తాత్కాలిక షెడ్లను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించి ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి దాదాపు రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కాపాడింది.
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు.. హైటెక్స్ సమీపంలోని సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమిలో ఎకరాలకొద్దీ ఆక్రమణలకు గురవుతోందని అక్కడి నివాసితులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేల్చింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా పలు రకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తూ 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు.
మొండికుంటతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై జనవరి 31న రెవెన్యూ అధికారులతో పాటు.. కబ్జాలకు పాల్పడిన వారితో సమావేశం నిర్వహించి ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గురువారం హైడ్రా అధికారులు జేసీబీలు హిటాచిలతో ఆక్రమణలను తొలగింపు పనులు చేపట్టారు. పదుల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధ నారీశ్వరి ఆలయం చైర్మన్ మహిపాల్ యాదవ్, పూజారులు, షాపుల యజమానులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, స్టేటస్ కో ఉన్నా పట్టించుకోకుండా ఎలా కూల్చివేస్తారని హైడ్రా తీరుపై మండిపడ్డారు. ఆక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని, చెరువును కూడా అభివృద్ధి చేసి సుందరీకరించాలని స్థానికులు హైడ్రా అధికారులను కోరారు.
