- బ్యారేజీలతోపాటు అలైన్‌మెంట్ల ఖర్చు వివరాలను పొందుపరచాలని సూచనలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత కీలకమైన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్(పీఎఫ్ఆర్) తయారయింది. ఆ రిపోర్టును నాలుగైదు రోజుల క్రితమే ప్రభుత్వానికి ఆర్వీ అసోసియేట్స్ అందజేసినట్టు తెలిసింది. అయితే, ఆ రిపోర్టులో పలు అంశాలపై ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను తెలియజేసినట్టు సమాచారం. ముఖ్యంగా హైడ్రాలజీ చాప్టర్‌లో మార్పులకు సంబంధించి కీలక సూచనలను ఏజెన్సీకి చెప్పినట్టు తెలిసింది.
152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తే.. వచ్చే నీటి లభ్యతపై 163 టీఎంసీల విషయంలో మార్పులను సూచించినట్టు సమాచారం. అంతేగాకుండా.. పీఎఫ్ఆర్‌లో బ్యారేజీల నిర్మాణం, అలైన్‌మెంట్‌లో కాలువ నిర్మాణం వంటి విషయాలకు సంబంధించి అయ్యే ఖర్చుల వివరాలను కూడా పొందుపరచాలని చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఆ మార్పులను కూడా ఆర్వీ అసోసియేట్స్ చేసినట్టు సమాచారం. మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌ను ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి తిరిగి సమర్పించనున్నట్టు తెలిసింది.
నాలుగు ఎత్తుల్లో నీటి లభ్యతపై క్లారిటీ..
తుమ్మిడిహెట్టి వద్ద రెండు బ్యారేజీలుగా ప్రాజెక్టును నిర్మించాలని పీఎఫ్ఆర్‌లో ఏజెన్సీ సూచించినట్టు సమాచారం. వైన్‌గంగా, వార్ధాలపై రెండు వేర్వేరు బ్యారేజీలను నిర్మించి.. ఆ రెండింటిని కాంక్రీట్ బండ్‌తో కనెక్ట్ చేయాలని చెప్పినట్టు తెలిసింది. ఇక, 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించాలని వాస్తవ ప్రతిపాదనల్లో పెట్టగా.. ఆ ఎత్తుతో అన్ని కలిపి 165 టీఎంసీలదాకా నీళ్లు లభిస్తున్నాయని పీఎఫ్ఆర్లోని హైడ్రాలజీ చాప్టర్‌లో పేర్కొన్నట్టు సమాచారం. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 129 టీఎంసీలు, 149 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 80, 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 58 టీఎంసీల దాకా నీటి లభ్యత ఉంటున్నట్టుగా తేలింది. ప్రభుత్వం కనీసం 150 మీటర్ల ఎత్తుతోనైనా బ్యారేజీని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇటు కెనాల్ అలైన్‌మెంట్‌పైనా పీఎఫ్ఆర్‌లో క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కిలోమీటర్ల కెనాల్ ఉండగా.. అక్కడి నుంచి బొగ్గుబ్లాకులున్న మార్గాన్ని తాకకుండా అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించినట్టు సమాచారం. మైలారం నుంచి 22 కిలోమీటర్ల టన్నెల్, మరో 5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించాలని సూచించినట్టు సమాచారం.
