డిజిటల్ లిటరసీతోనే యువతకు మంచి భవిష్యత్తు: జిష్ణు దేవ్ వర్మ

డిజిటల్ లిటరసీతోనే  యువతకు మంచి భవిష్యత్తు: జిష్ణు దేవ్ వర్మ
  • చదువుతోపాటు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి: గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ
  •     చదువుకునేందుకు గృహిణులు, వృద్ధులు, దివ్యాంగులు,  ఖైదీలకు 
  • అంబేద్కర్ వర్సిటీ గొప్ప అవకాశంగా మారిందని వెల్లడి
  •     అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ కాన్వొకేషన్‌‌ డేకు హాజరు
  •     గోరటి వెంకన్న,  ప్రేమ్ రావత్‌‌కు  గౌరవ డాక్టరేట్ ప్రదానం

హైదరాబాద్, వెలుగు:  ప్రతిభగల విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ తెలిపారు.  డిజిటల్‌‌ లిటరసీతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.  చదువుతోపాటు ఇండస్ట్రీకి అవసరమైన టెక్నికల్​స్కిల్స్‌‌ కూడా నేర్చుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ కాన్వొకేషన్ డేలో జిష్ణుదేవ్‌‌వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి గృహిణులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులు, ఖైదీలకు అంబేద్కర్ వర్సిటీ గొప్ప అవకాశంగా మారిందని అన్నారు. ఆదివాసీ, గిరిజన  విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం అంటే సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడమేనని, ఓపెన్  వర్సిటీ చేస్తున్న ప్రయత్నం గొప్పదని ప్రశంసించారు. ట్రాన్స్ జెండర్ విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత స్కాలర్‌‌షిప్‌‌లు రాజ్యాంగ విలువలను కాపాడేలా ఉన్నాయన్నారు.  ఖైదీలు పట్టభద్రులు కావడం వారిలో పరివర్తనకు నాంది కానుందని తెలిపారు. 

దూర విద్యే కీలక శక్తి: ఇగ్నో వీసీ

మారుతున్న పరిస్థితుల్లో దూర విద్య, డిజిటల్ విద్య కీలక పాత్ర పోషిస్తాయని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ చాన్స్‌‌లర్‌‌ ఉమా కాంజీలాల్ అన్నారు. మూక్స్ ద్వారా వర్చువల్ ల్యాబులు, ఏఐలాంటి సాంకేతికతలను విస్తృతపర్చడంలో అవి కీలకమని చెప్పారు. కొవిడ్‌‌లాంటి వివత్తుల టైమ్‌‌లో అంబేద్కర్ వర్సిటీ అనుసరించిన విధానం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ వర్సిటీలతో సమానంగా దూర విద్య, డిజిటల్ విద్యలో సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామని వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు. రాబోయే ఐదేండ్లలో పోలీస్ శాఖలోని ప్రతి ఉద్యోగి డిగ్రీ పూర్తి చేసుకునేలా తెలంగాణ పోలీస్ విభాగంతో ప్రత్యేకంగా కోర్సును డిజైన్ చేశామని చెప్పారు. విద్యార్థులకు ఉపాధి కల్పన కోసం ప్రముఖ సంస్థలతో కలిసి ఉపకార వేతనంతో కూడిన అప్రెంటిస్‌‌షిప్‌‌ ప్రోగ్రామ్ కోసం డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకున్నామని 
వివరించారు.

ఇద్దరికి గౌరవ డాక్టరేట్

ప్రఖ్యాత గేయ రచయిత, కవి గోరటి వెంకన్నకు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాంతి విద్యా ప్రచారకుడు, రచయిత ప్రేమ్ రావత్‌‌కు గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్)ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. ఈ కాన్వొకేషన్‌‌ డేలో మొత్తం 60,288 మంది అభ్యర్థులు  డిగ్రీలు/ డిప్లొమాలు/సర్టిఫికెట్లు అందుకున్నారు. వీరిలో 32,373 మంది మహిళలు ఉండటం విశేషం. అయితే, 86 బంగారు పతకాలు ప్రదానం చేయగా, వాటిలో 67 మహిళలకే లభించాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.