తెలంగాణలో ఇవాళ్టి( జూన్ 2) నుంచే అమల్లోకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

తెలంగాణలో ఇవాళ్టి( జూన్ 2) నుంచే అమల్లోకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం) అమలుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు అంటే  జూన్ 2 నుంచే ఈ చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయ శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గవర్నర్ పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల కాలంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు,  వేధింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు.

ఈ కొత్త చట్టం అమలుతో న్యాయవాదుల హక్కులకు, వారి వృత్తిపరమైన భద్రతకు మరింత బలం చేకూరనుంది. ఇకపై లాయర్లపై ఎలాంటి దాడులకు పాల్పడినా ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.