గ్రాడ్యుయేట్లు ఎటువైపు? ఎవరివైపు?

గ్రాడ్యుయేట్లు ఎటువైపు? ఎవరివైపు?

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పెంచాయి. గెలుపు కోసం అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాన పార్టీలు, చిన్న పార్టీలకు ఇండిపెండెంట్లు గట్టి సవాల్ విసురుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం సెగ్మెంట్లో 71 మంది, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సెగ్మెంట్లో 93 మంది క్యాండిడేట్లు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించకపోవడం మొదలైన అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం సెగ్మెంట్లో అభ్యర్థుల మనోగతం వారి మాటల్లోనే.

నిరుద్యోగులకు ఉపాధి.. ఉద్యోగులకు పీఆర్సీ
నా దగ్గరకు వచ్చిన ప్రతి ఉద్యోగ, టీచర్, స్టూడెంట్ సంఘాలకు అందుబాటులో ఉన్నా. మళ్లీ గెలిపిస్తే.. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో పాత్ర తీసుకుంటా. ఉద్యోగుల జీతభత్యాలు పెంచడం, చిరు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంతోపాటు పీఆర్సీ వర్తించని వాళ్లకూ దాన్ని వర్తింప చేసి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తాను. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినయ్. నల్గొండ జిల్లానూ ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తాను. మూడు జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్టార్ట్ చేసినం. ఆ సెంటర్ల ద్వారా లోకల్ యువతకు ట్రైనింగ్ ఇప్పించడంతోపాటు లోకల్గా వచ్చే కంపెనీల్లో వాళ్లకే ఉద్యోగాల్లో సింహభాగం వచ్చేలా చేస్తాను. నిరుద్యోగులకు సంబంధించి రూ.వెయ్యి కోట్లతో కొత్త ప్యాకేజీ రాబోతోంది. దీని ద్వారా ప్రతి గ్రామంలో 20 నుంచి 30 మంది నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడేలా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం కింద సాయం చేస్తాం. రూ.ఐదు లక్షలకు తగ్గకుండా అందేలా చూస్తా. ఈ స్కీమ్ రూ.వెయ్యి కోట్లతో మొదలై తర్వాత రూ.10 వేల కోట్లకు చేరుకుంటుంది.  రాష్ట్రంలో ఉన్న ఖాళీలకు సంబంధించి త్వరగా నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తా. 
- పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్

నా సమస్య అన్నట్టు పోరాడతా
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల సమస్యల కోసం పోరాడుతా. నేను పోరాటాల ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిగా చెబుతున్నా.. ఆరేండ్లు ఇవన్నీ నా సమస్యలుగానే ఫీలవుతా. మొదటి నుంచి నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మండలిలో మాట్లాడుతా. కొట్లాడతా.. పోరాడుతా. పల్లాకు ఒక చాన్స్ ఇచ్చిచూశాం. గడిచిన ఆరేండ్లలో గ్రాడ్యుయేట్ల కోసం చేసిందేం లేదు. మళ్లీ ఆయనకు ఓటేస్తే మనం తప్పుచేసినట్లే అవుతుంది. సీనియర్ జర్నలిస్ట్గా అందరి సమస్యలపై నాకు అవగాహన ఉంది. నన్ను గెలిపిస్తే గ్రాడ్యుయేట్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతా. ఎంప్లాయిస్ ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీలపై నిలదీస్తా. వాటిని సాధిస్తా. 
- జయసారథిరెడ్డి, లెఫ్ట్ పార్టీలు

ప్రశ్నించే గొంతును గెలిపించండి
పల్లా రాజేశ్వర్రెడ్డికి పట్టభద్రులు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే.. కోట్ల రూపాయలు సంపాదించు కోవడం తప్పించి గ్రాడ్యుయేట్ల పక్షాన ఏం మాట్లాడలె. నిరుద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్ల గురించి నోరు విప్పలేదు. నేను తెలంగాణ ఉద్యమకారుడినే. నాది ప్రశ్నించే గొంతు. గర్జించే గొంతు. ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి కూడా సమస్యలపై ప్రతిపక్షంలా మాట్లాడిన. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగుల సమస్యలు, కాలేజీలు మూతపడటంపై గళం వినిపించా. టీఆర్ఎస్ నేతలు ఎస్సీ, ఎస్టీలను.. టాటా, బిర్లా చేస్తమన్నరు. మీరు ఉద్యోగులుగా చేయడమేంటి.. మీరే ఉద్యోగాలు ఇచ్చేలా తయారు చేస్తమన్నరు. మరీ ఏమైంది. చివరికి వారందరిని బికారీలను చేసిన్రు. ఇదే విషయాన్ని అప్పట్లోనే మండలిలో చెప్పినా. ఇప్పుడు అవకాశం ఇస్తే.. ఆరేండ్లు నిరుద్యోగులు, ఉద్యోగుల వెంట ఉంటా. పోరాడుతా. మిస్డ్ కాల్ ఇచ్చినా.. క్షణంలో అక్కడ వాలుతా.
- రాములు నాయక్, కాంగ్రెస్

మహాజన గొంతును మండలిలో వినిపిస్తా 
1997లో తెలంగాణ మహాసభ జరిగిన నాటి నుంచి మొదలు పెడితే ఎన్నో ఉద్యమాలు చేసినం. కష్టకాలంలో కేసీఆర్ పార్టీ మూతపడుతున్నప్పుడు నిలబెట్టింది మేమే. తెలంగాణ భవన్ ప్రతి ఇటుక మా రక్తం, మా శ్వేధంతో కట్టిందే. తెలంగాణ కోసం ఎన్నిసార్లు జైలుకుపోయామో తెల్వదు. ఎన్నిసార్లు ఉద్యమాల్లో లొల్లి పడ్డమో తెల్వదు. నాకు నేను గొప్ప ఉద్యమకారుడిని అని చెప్పను. కానీ.. ఉద్యమకారుడిగా అనేక కష్టాలు పడ్డాను. ఉద్యమంలో పాల్గొన్న కాలం నేను నష్టపోయిన జీవితానికి సమానం కాదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతు. పాలకపక్షంలో ఉంటే గొంతుమూగపోవడమా?. చిన్నపక్షమైనా, పెద్ద పక్షమైనా ఆధిపత్య కులాలే ఉండాలనే ఆలోచనే తప్పు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో మెజార్టీ సెగ్మెంట్లలో ఒక సామాజిక వర్గమే కొనసాగుతోంది. ఒక ఉద్యమకారుడు, బహుజన బిడ్డను ఎన్నుకోవడమా? ప్రశ్నించే గొంతుల పేరు మీద ఇంకో ఆధిపత్య కులానికి అధికారం అప్పగించడమా? అనే విషయంలో గ్రాడ్యుయేట్లకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, క్షేత్రస్థాయిలో ఐక్య ఉద్యమాల్లో ముందుండి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ, టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
- చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ

ఎంప్లాయిమెంట్ పాలసీ తెస్త..
నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఎంప్లాయిమెంట్ పాలసీ తీసుకొస్తా. ప్రతి ఏటా జనవరి 1న అకడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తా. వచ్చే మూడు నెలల్లోపు నోటిఫికేషన్లు ఇవ్వడం, నియామక ప్రక్రియ చేపట్టేందుకు కృషి చేస్తా. ఈ ఆరేండ్ల కాలంలో నిరుద్యోగులు కోల్పోయిన వయో పరిమితిని యాడ్ చేయిస్తా. లోకల్ రిజర్వేషన్ యాక్ట్ పెట్టి స్థానికంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో లోకల్ నిరుద్యోగులకు జాబ్లు వచ్చేలా కృషి చేస్తా. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీలు, పార్ట్టైం ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి కృషి చేస్తా. ప్రైవేటు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చట్టం తీసుకొచ్చేలా చేస్తా. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు పటిష్టం చేసేలా కృషి చేస్తా. అలాగే మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తా. మహిళలు ఉద్యోగాలు చేసే చోట భద్రత కల్పించడంతో పాటు చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా కృషి చేస్తా. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, కొత్త సర్వీసు రూల్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ స్కీం అమలయ్యేలా చూస్తా. నర్సులు, ఏఎన్ఎంలు, హోంగార్డులు, విద్యుత్ ఉద్యోగులు వీరంతా ప్రభుత్వ ఉద్యోగులా? ప్రైవేటు ఉద్యోగులా? తేల్చుకోలేకపోతున్నరు. వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ నిబంధనలు వర్తిస్తాయో అవే సర్వీసు రూల్స్ అమలయ్యేలా చూస్తా.
- రాణిరుద్రమరెడ్డి, యువ తెలంగాణ పార్టీ

మాతోనే.. రాజకీయ మార్పు
రాష్ట్రంలో రాజకీయ మార్పు సాధించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు మాకు ఓటెయ్యాలి. స్వార్థం, సొంత కుటుంబం, ఆస్తుల సంపాదన రాజకీయాల్లో కీలకమయ్యాయి. అవి మారాలి. మార్పు లేకుంటే తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే మా కొట్లాట. మార్పు జరిగితేనే ఉపాధి సాధ్యం. దీంతోనే నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమవుతుంది. ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులకు కూడా ఓ రక్షణ వస్తుంది. మా పోరాటం ప్రధానంగా చూస్తే ప్రజలు కేంద్రంగా రాజకీయం ఉండాలె. ప్రజలు కేంద్రంగా పాలన సాగాలె. రెండోది ఉపాధి కల్పన. మూడోది కాంట్రాక్ట్ టీచర్లు, ఉద్యోగులు చట్టప్రకారం ఏర్పడ్డారు. వారి హక్కులను గుర్తించాలి. ఇప్పుడు వారిని కట్టుబానిసల్లా చూస్తున్నారు. చివరగా ఏంటంటే.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం ఫ్యాకల్టీకి సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఉండాలె. దీనిని సాధించడానికి పోరాటం చేస్తం. మా గెలుపుతోనే రాజకీయ మార్పు సాధ్యమవుతది.
- ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్

పనిచేయకుంటే రాజీనామా ఇస్తా 
పల్లా రాజేశ్వర్రెడ్డి మాదిరిగా నేను డబ్బు సంచుల మనిషిని కాదు. జనాలకు మాటిచ్చి మరిచిపోవడం చేతకాదు. గ్రాడ్యుయేట్ల ఓట్లతో గెలిచి పల్లా ప్రైవేట్ వర్సిటీ తెచ్చుకున్నడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని దొంగ ఓట్లు నమోదు చేయించిండు. దేశ రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నా. ప్రజల చేతుల్లో నాయకుల జుట్టు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ముందుకుసాగుతున్నం. అందుకే రెఫరెండం అనే పదం పట్టుకొచ్చినం. అది మా మీద మేమే ప్రయోగించుకుంటున్నం. మూడేండ్లలో ప్రజలు మెచ్చినట్లు పనిచేయకుంటే పదవికి రాజీనామా ఇస్తం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ నాయకుని మీదా పెట్టని విధంగా 20 కేసులను నా మీద పెట్టింది. ఎందుకంటే నేను ప్రజల తరఫున కొట్లాడుతున్న. నిత్యం జనం తరఫున ప్రశ్నిస్తున్న. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు. చనిపోయేటప్పుడు ఒంటి మీద అంగి, లాగు రెండే ఆస్తిగా ఉండాలని ప్రకటించినవాళ్లం. డబ్బుల కోసం అమ్ముడుపోను, ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటా.
- తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్ అభ్యర్థి

పల్లాకు బుద్ధి చెబితే.. కేసీఆర్ దిగొస్తడు
నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేటు టీచర్ల సమస్యలపై ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఏనాడూ మాట్లాడింది లేదు. గడిచిన ఆరేండ్లలో పల్లా తన గల్లా నింపుకున్నాడు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్ను నియమించలేదు. కానీ పల్లాకు సొంత యూనివర్సిటీ వచ్చింది. నోటిఫికేషన్లు లేక..  డీఎస్సీ వేయక గ్రాడ్యుయేట్లు కూలీలుగా మారారు. టీచర్లు ఆగమవుతున్నారు. కోట్లు ఖర్చు చేసైనా పట్టభద్రులను కొనేస్తామని టీఆర్ఎస్ పార్టీ, పల్లా అనుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ల పౌరుషం ఎలా ఉంటదో ఓటుతో బుద్ధి చెబితేనే.. సీఎం కేసీఆర్ అహం దిగుతది. ఒక్కో ఓటుకు రూ.25 వేల చొప్పున పంచినా.. గ్రాడ్యుయేట్లు తెలివిగా ఓటు మాత్రం బీజేపీ అభ్యర్థిగా నాకే వేస్తారని నమ్ముతున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి కేంద్రమే నిధులిస్తోంది. కేసీఆర్ మాత్రం తన ఫోటోతో ప్రచారం చేసుకుంటున్నాడు. నేషనల్ హైవేలు, ఆయుష్మాన్ భారత్, స్మార్ట్ సిటీ, అమృత్, సడక్ యోజన ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కటి కేంద్రానివే. త్వరలో రూ.17,500 కోట్లతో మరిన్ని నేషనల్ హైవేలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా నిరుద్యోగులకు ఉపాధి దక్కాల్సిన ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఏవైనా ఎలక్షన్స్ వస్తే తప్పితే సీఎం కేసీఆర్కు ఉద్యోగుల పీఆర్సీ, డిమాండ్లు గుర్తుకు రావు. నాకు ఒక్క అవకాశమివ్వండి. టీచర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేటు టీచర్ల సమస్యలపై గళం విప్పుతా. కల్వకుంట్ల సొంత జిల్లాలోని దుబ్బాకలో ప్రజలు కేసీఆర్ మాయ మాటలకు లొంగిపోకుండా ఓటుతో బుద్ది చెప్పిన్రు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు కూడా కర్రుకాల్చి వాత పెట్టిన్రు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లకు ఆ చాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల్లో పల్లాను ఓడించి, ఓటుతో బుద్ధి చెప్పాలె. ఆ దెబ్బకు కేసీఆర్ దిగొస్తడు.
- గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీజేపీ