మానేరు నదిలో ఇసుక తవ్వకాలు నిలిపేయండి

మానేరు నదిలో ఇసుక తవ్వకాలు నిలిపేయండి

హైదరాబాద్‌, వెలుగు : మానేరు నదిలో తదుపరి హియరింగ్‌ వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఒకవేళ వర్క్‌ ఏజెన్సీకి నిర్దేశిత పర్యావరణ అనుమతులు ఇచ్చి ఉంటే ఇసుక తవ్వకాలు కొనసాగించవచ్చని తెలిపింది. పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిలో నిబంధనలు అతిక్రమించి ఇసుక తవ్వుతున్నారని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి గొట్టిముక్కుల సురేశ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఎస్‌కేఆర్‌ కన్​స్ట్రక్షన్స్‌ పర్యావణ అనుమతులు లేకుండానే పనులు చేస్తోందని తెలిపారు. 

డ్యాంలు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాల్వల్లో పూడిక పేరుకుపోకుండా వాటి నిర్వహణ కోసం ఇసుక తవ్వకానికి ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్​లను అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తవ్వేస్తున్నారని ఆక్షేపించారు. మడక రీచ్‌ 2లోని చెక్‌డ్యాంలో పూడిక పేరుకుపోకుండా 3.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తీసేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది తమకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌ జ్యుడీషియల్​ మెంబర్‌ జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, ఎక్స్​పర్ట్‌ మెంబర్‌ సత్యగోపాల్‌ తెలిపారు. ఈ కేసులో పెద్దపల్లి కలెక్టర్‌ తరఫున మాత్రమే ట్రిబ్యునల్‌కు రిప్లయ్‌ ఇచ్చారని, మిగతా ప్రతివాదులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి ఉందన్నారు.  అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో ‘బీ1 కేటగిరి’, ‘బీ2 కేటగిరి’ అంటే ఏమిటో వివరణ ఇవ్వాలని.. మ్యానువల్‌, మెకానికల్‌, సెమీ మెకానికల్‌ మైనింగ్‌ అంటే ఏమిటో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను జనవరి మూడో తేదీకి వాయిదా వేశారు.