మద్యం మత్తులో… పుస్తెలు తెగుతున్నయ్‌

మద్యం మత్తులో… పుస్తెలు తెగుతున్నయ్‌

విచ్చలవిడి మద్యం విక్రయాలు లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాగితాగి అనారోగ్యంతో కొందరు మరణిస్తుండగా, మరికొందరు మద్యం మత్తులో యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. వారి కన్నవాళ్లు కడుపుకోత అనుభవిస్తుండగా.. కట్టుకున్నవారు చిన్నవయసులోనే వితంతువులుగా మారుతున్నారు. రాష్ట్రంలో వితంతు పెన్షన్​ పొందుతున్న మహిళల్లో 20 శాతానికిపైగా ఇలా ‘మద్యం’ బాధితులే. సంపాదించేవారు చనిపోయి పిల్లల పోషణ భారం మీదపడటంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. కూలిపనులకు వెళ్లినా డబ్బు సరిపోక పిల్లలను బడికి కూడా పంపని పరిస్థితి ఉంది.

మూడు లక్షల మందికిపైగా..

రాష్ట్రంలో 2014లో 12,77,403 మంది వితంతు పెన్షన్‌‌ పొందగా.. ఆ సంఖ్య ఈ ఏడాది అక్టోబర్‌‌ నాటికి 14,52,545కు చేరింది. ప్రస్తుత లబ్ధిదారుల్లో18–25 ఏళ్ల వయసు వారు 5,535 మంది, 26–30 ఏళ్లవారు 25,707 మంది, 31–35 ఏళ్లవారు 75,399 మంది, 36–40 ఏళ్లవారు 1,42,092 మంది, 41–50 ఏళ్లవారు 3,19,830 మంది, 51–60 ఏళ్లవారు 3,50,904 మంది, 60 ఏళ్లుపైబడినవారు 5,33,078 మంది వితంతువులు ఉన్నారు. వితంతువుల సంక్షేమం, వారి ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న బాల వికాస అనే స్వచ్ఛంద సంస్థతోపాటు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌, ప్రస్తుత రిజిస్ట్రార్‌‌ భట్టు రమేశ్  కొంతకాలం కింద వేర్వేరుగా అధ్యయనాలు నిర్వహించారు. 15 వేల మంది వితంతువులను కలిసి సర్వే చేశారు. అందులో 20 శాతం మందికిపైగా మహిళల భర్తలు మద్యం కారణంగానే చనిపోయారని గుర్తించారు. అంచనాల ప్రకారం వితంతు పెన్షన్​ పొందుతున్నవారిలో సుమారు మూడు లక్షల మంది ‘మద్యం’ బాధితులేనని తేల్చారు.

చితికిపోతున్న కుటుంబాలు

గతంలో గ్రామాల్లో గుడుంబా, సారా ప్రభావం విపరీతంగా ఉండేది. కొంతకాలంగా వాటి విక్రయాలు తగ్గినా అదే స్థాయిలో లిక్కర్‌‌ వినియోగం పెరిగింది. ఊర్లలో తాగుడుకు అలవాటుపడ్డవాళ్లు సంపాదనంతా దానికే పెడుతున్నారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు తాగుడుకు అలవాటైన వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ట్రీట్​మెంట్​ కోసం అప్పులు చేస్తున్నారు. చివరికి ప్రాణాలు వదులుతున్నారు. దీంతో కుటుంబ భారం మహిళలపై పడుతోంది.

ఊర్లలో సందుకో బెల్ట్​షాపు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊర్లలో విచ్చలవిడిగా బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. సందు సందుకో దుకాణంతో కొన్ని ఊర్లలోనైతే పదికిపైగా బెల్టు షాపులు ఉంటున్నాయి. వాటిలో కల్తీ మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి.

ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైవేల వెంట వైన్​ షాపులను తొలగించారు. కానీ హైవేల వెంట హోటళ్లు, దుకాణాల్లో పెద్ద సంఖ్యలో బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. అవి లారీ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు అడ్డాగా మారుతున్నాయి. వారు తాగి నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

మరోవైపు వైన్స్‌‌ షాపుల వద్ద పర్మిట్‌‌ రూమ్‌‌లకు పర్మిషన్లు ఇవ్వడంతో అవన్నీ బార్లను మించిపోయాయి. ఏకంగా పెద్ద పెద్ద హాళ్లలో, కొన్నిచోట్ల రెండు మూడు అంతస్తుల బిల్డింగులలో పర్మిట్​ రూంలను నడుపుతున్నారు.

ఇటీవల మహిళలపై దారుణాలకు పాల్పడ్డవారు మద్యం మత్తులోనే ఆ పనులకు తెగబడినట్టు గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఫోకస్​పడింది. మద్యాన్ని నియంత్రించాలని, పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

నేరాల్లో ‘లిక్కర్‌‌’తో జరిగేవే ఎక్కువ!

నేషనల్‌‌ క్రైం రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్‌‌ఆర్‌‌సీబీ) లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 నుంచి 85 శాతం నేరాలు మద్యం మత్తులో జరుగుతున్నవే. రాష్ట్రంలో 2016లో 1,278 రేప్‌‌ కేసులు నమోదుకాగా.. 2017లో 1,528, 2018లో 1,565 కేసులు నమోదయ్యాయి. ఏటా సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన దిశ, సమత కేసుల్లో నిందితులు తాగిన మత్తులోనే ఘాతుకాలకు పాల్పడినట్టు గుర్తించారు.

ఆసరా’ వితంతు పెన్షన్​ లెక్కలివీ..

రాష్ట్రంలో ఆసరా కింద వితంతు పెన్షన్‌‌ పొందుతున్నవారి సంఖ్య 14,52,545 మందికాగా.. వారిలో 40 ఏళ్లలోపువారే 2.50 లక్షల మంది ఉన్నారు. 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు మరో 3.19 లక్షల మంది ఉన్నారు.

ఏజ్‌‌ గ్రూప్‌‌               సంఖ్య (పెన్షనర్లు)

18-25     5,535

26-30     25,707

31-35     75,399

36-40     1,42,092

41-50     3,19,830

51-60     3,50,904

60 పైన    5,33,078

మొత్తం   14,52,545