సీఈఓ జీతం సగటు ఉద్యోగి కంటే 662 రెట్లు ఎక్కువ.. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న అసమానతలు..

సీఈఓ జీతం సగటు ఉద్యోగి కంటే 662 రెట్లు  ఎక్కువ.. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న అసమానతలు..
  • హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌లో  పెరుగుతున్న అసమానత
  • కంపెనీ సీఈఓ విజయకుమార్  శాలరీ 71 శాతం  పెరిగి రూ.154 కోట్లకు‌‌‌‌ 
  • సగటు ఉద్యోగి శాలరీ హైక్‌‌‌‌ మాత్రం 3.1 శాతమే
  • ఇన్ఫోసిస్‌‌‌‌లో గ్యాప్‌‌‌‌ 752 రెట్లు..విప్రోలో 548 రెట్లు..టీసీఎస్‌‌‌‌లో 332.8 రెట్లు

న్యూఢిల్లీ: అమెరికాను ఇండియా అందుకోవడమే కాదు దాటేసింది. టాప్ మేనేజ్‌‌‌‌‌‌మెంట్‌‌‌‌కు, సగటు ఉద్యోగికి ఇస్తున్న జీతాల వ్యత్యాసంలో మన ఐటీ కంపెనీలు టాప్‌‌‌‌లో ఉన్నాయి. అమెరికా ఎస్ అండ్ పీ ఇండెక్స్‌‌‌‌లోని కంపెనీల్లో ఈ అంతరం 280–300 రెట్ల మధ్య ఉండగా, ఇండియన్ ఐటీ కంపెనీల్లో ఏకంగా 752 రెట్ల వరకు చేరింది.  తాజాగా  హెచ్‌‌‌‌సీఎల్ టెక్ సీఈఓ  సీ విజయకుమార్‌‌‌‌‌‌‌‌ శాలరీ ప్యాకేజి 2025–26 కి గాను ఏకంగా 71 శాతం పెరిగింది. దీంతో ఆయన జీతం రూ.94.6 కోట్ల నుంచి రూ.154 కోట్లకు చేరింది. 

ఐటీ కంపెనీల్లో అత్యధికంగా శాలరీ అందుకుంటున్న సీఈఓగా ఆయన నిలిచారు.  హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌లో సగటు ఉద్యోగి అందుకుంటున్న జీతం మాత్రం రూ.14 లక్షల దగ్గరనే ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.1 శాతం మాత్రమే జీతం పెరిగింది. అంటే కిందిస్థాయిలో కష్టపడుతున్న ఉద్యోగికి, సీఈఓకి మధ్య శాలరీ అంతరం ఏకంగా 662 రెట్లు ఉంది.  ఒక రోజు సీఈఓ  సంపాదన కోసం సగటు ఉద్యోగి ఏకంగా రెండేళ్లు కష్టపడాల్సి ఉంటోంది.  మిగిలిన ఐటీ కంపెనీల్లో కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌‌‌‌లో ఈ అసమానత చాలా ఎక్కువగా ఉంది.  752 రెట్లకు చేరి ఇండస్ట్రీలో అత్యధికంగా నమోదైంది.

  • ఇతర కంపెనీలు..

ఇన్ఫోసిస్‌‌‌‌ సీఈఓ  సలీల్ పరేఖ్‌‌‌‌ జీతం 2024–25 లో రూ.80.6 కోట్లుగా ఉంది. ఈ కంపెనీలో పనిచేస్తున్న సగటు ఉద్యోగి జీతం రూ.10.7 లక్షలు.  విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా ప్యాకేజీ కూడా రూ.53.6 కోట్లు. ఈ కంపెనీలో సగటు ఉద్యోగి రూ.9.8 లక్షల ప్యాకేజి అందుకుంటున్నారు.  విప్రోలో  సీఈఓ, సగటు ఉద్యోగి జీతాల మధ్య వ్యత్యాసం 548 రెట్లు ఉంది.  జీతాల అసమానతలో టీసీఎస్‌‌‌‌ కొద్దిగా బెటర్ పొజిషన్‌‌‌‌లో ఉంది. ఈ కంపెనీ సీఈఓ  కే కృతివాసన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.28 కోట్ల శాలరీ ప్యాకేజి అందుకున్నారు. 2024–25 లో ఇది రూ.26 కోట్ల దగ్గర ఉంది. సీఈఓ  శాలరీ  సగటు ఉద్యోగి జీతం కంటే 332.8 రెట్లు ఎక్కువ. 

  • ఎందుకీ అంతరం..

ఇండియన్  ఐటీ కంపెనీల సీఈఓల జీతాలను అంతర్జాతీయ మార్కెట్ (డాలర్ల) ప్రమాణాల బట్టి నిర్ణయిస్తారు. కానీ కింద పనిచేసే డెవలపర్లు లేదా ఇంజనీర్ల జీతాలను మాత్రం భారతీయ రూపాయల్లో, ఇక్కడి ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే ఈ కింది స్థాయి ఉద్యోగుల జీతాల పెంపు  కేవలం 3 శాతం నుంచి 6శాతం మధ్యలోనే ఉంటోంది. 

సీఈఓల జీతాలు ఇంత ఎక్కువగా ఉండడం   కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా మంచిది కాదని ఎనలిస్టులు చెబుతున్నారు. అడ్వైజరీ సంస్థలు , ఇన్వెస్టర్లు ఇప్పుడు కంపెనీల బోర్డు మీటింగులలో ఈ భారీ సీఈఓ జీతాల తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. కంపెనీని నడిపించే లీడర్‌‌‌‌కు మంచి ప్యాకేజీ ఇవ్వడం తప్పు కాదు, కానీ గ్రౌండ్ లెవెల్‌‌‌‌లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెరగకుండా, కేవలం టాప్ ఫ్లోర్ జీతాలే రెట్టింపు అవ్వడం కంపెనీకి  మంచిది కాదు.