గుజరాత్‌ సీఎం రాజీనామా: ఏడాదిలో నాలుగో బీజేపీ నేత

గుజరాత్‌ సీఎం రాజీనామా: ఏడాదిలో నాలుగో బీజేపీ నేత

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో  గవర్నర్ ఆచార్య దేవ వ్రత్‌ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో పని చేసే వాళ్లందరికీ సమాన అవకాశాలు కల్పించడం బీజేపీ సంప్రదాయమని చెప్పారు. గుజరాత్‌లో అభివృద్ధి కొనసాగుతుందని, తనకు పార్టీ అప్పగించే కొత్త బాధ్యతలను మరింత ఉత్సాహంతో నిర్వర్తిస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని, పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పగించిన తన సేవలు అందిస్తానని రూపానీ తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర నాయకత్వ మార్గదర్శనంలో పార్టీ నడుస్తుందని చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేయగా.. అందులోనూ రూపానీ పాల్గొన్నారు. అయితే ఇంత సడన్‌గా ఆయన రాజీనామా చేయడానికి కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.

2016లో నాటి సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో సీఎం పదవిలోకి వచ్చిన విజయ్ రూపానీ ఆ తర్వాతి ఏడాదిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం నడుస్తున్నప్పటికీ బీజేపీని విజయవంతంగా అధికారంలోకి తీసుకురాగలిగారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇలా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న  నితిన్ పటేల్‌ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది.

ఈ ఏడాదిలో ఇలా బీజేపీ సీఎంలు తమ పదవులు కోల్పోవడం ఇది నాలుగో సారి. జులైలో కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప ఉన్నట్టుండి రాజీనామా చేశారు. అలాగే ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర రావత్‌, తీరథ్‌ సింగ్ రావత్‌ ఇద్దరు వెంట వెంటనే తమ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పుష్కర్ సింగ్‌ ధామి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.