TCS.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ .. టీసీఎస్‌లో ఐటీ ఉద్యోగం అంటే జీవితం సెటిల్.. హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు.. టెన్షన్స్ ఏమీ ఉండవు అనుకునే వాళ్లు ఎందరో.. అంతేనా ఐటీ ఇండస్ట్రీలో ఓ ఐటీ ఉద్యోగం దొరికితే చాలు జీవితం హ్యాపీ అనుకునే వాళ్లూ ఉన్నారు. TCS నాసిక్ ఆఫీసులో బయటపడిన బాగోతం చూసి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీనే షాక్ అయ్యింది. అలా ఇలా కాదు.. ఓ ఐటీ ఉద్యోగిని ఇచ్చిన కంప్లయింట్ పట్టుకుని.. తీగ లాగిన పోలీసులకు కొండంత బాగోతం.. చిన్న ఉద్యోగులపై వేధింపులు.. సూటిపోటి మాటలు.. ఇలా టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో బాగోతం మొత్తం బయటపడింది. మారువేషాల్లో లేడీ పోలీసులు.. నెల రోజులు చేసిన కోవర్ట్ ఆపరేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TCS నాసిక్ ఆఫీసులో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి దేవ్ లాలి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఆఫీసులో పని చేసే.. నా ఉన్నతాధికారి నాపై అత్యాచారం చేశాడు అని కంప్లయింట్. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే నేనూ వేధింపులకు గురయ్యాను.. నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ ఓ మగ ఉద్యోగితో సహా మరో ఎనిమిది మంది కంప్లయింట్ చేశారు. పోలీసులు షాక్. ఇంత మందిపై ఆఫీసులో వేధింపులు జరుగుతున్నాయా.. టీసీఎస్ నాసిక్ బ్రాంచిలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా అనే అనుమానానికి వచ్చారు పోలీసులు. అప్పటికే మొత్తం 10 కంప్లయింట్స్ వచ్చాయి.
ఈ క్రమంలోనే కంప్లయింట్ చేస్తున్న వారు నిజం చెబుతున్నారా లేదా.. వాళ్లు చెబుతున్నట్లు ఆఫీసులోని పై అధికారులు వేధిస్తున్నారా అని నిర్థారించుకోవటానికి.. నాసిక్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఆధారాలు సేకరించటానికి.. ఆఫీసులో జరుగుతున్న వ్యవహారాన్ని ఆధారాలతో బయటపెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఆరుగురు మహిళా పోలీసులతో కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. 2026, ఫిబ్రవరి నెలలో ఆరుగురు మహిళా పోలీసులు.. నాసిక్ లోని టీసీఎస్ బీపీవో (BPO)లోకి ప్రాజెక్టు విషయంపై వెళ్లారు. మారు వేషాల్లో ఆఫీసుకు వెళుతూ ఉన్నారు.
ఆఫీసులోని ఉద్యోగులతో మాట్లాడటం.. మహిళా ఉద్యోగులతో ముచ్చటించటం వంటివి చేశారు. ఈ క్రమంలోనే పై అధికారులు వచ్చి.. వాళ్లతో ఎలా మాట్లాడుతున్నారు.. ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే అన్ని విషయాలను రికార్డ్ చేశారు. అనుమానం ఉన్న ఏడుగురు ఉద్యోగులపై మఫ్టీలో నిఘా పెట్టారు. ఆల్ మోస్ట్ నెల రోజులు ఇలా నిఘా పెట్టటం.. ఆఫీసులో మారు వేషాల్లో తిరగటం.. ఉద్యోగుల నుంచి వివరాలు రాబట్టటం వంటి చేశారు. ఆఫీసులో జరుగుతున్న విషయాలు అన్నింటినీ ఎప్పటికిప్పుడు కమిషనర్ కు చెబుతూ వచ్చారు.
వేధింపులు, అరాచకాలు నిజమే అని నిర్థారించుకున్న తర్వాత.. అప్పటికే పోలీసులకు వచ్చిన అత్యాచారం, వేధింపుల కంప్లయింట్స్ ఆధారంగా.. అరెస్టులు మొదలుపెట్టారు పోలీసులు. ఆఫీసులోని సీనియర్ HR మేనేజర్ తో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ అరెస్టులపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాన్యం స్పందించింది. వేధింపులు ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని వెల్లడించింది. నాసిక్ ఆఫీసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను తొలగించినట్లు నోట్ రిలీజ్ చేసింది యాజమాన్యం. వేధింపులు లైగింకంగా లేదా మత మార్పిడుల రూపంలో లేక మరే విధంగా ఉన్న సహించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల భద్రత కోసం సంస్థ అత్యున్నత ప్రమాణాలను రూపొందించిందని.. నాసిక్ వ్యవహారం మా దృష్టికి వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

