ఏసుక్రీస్తులా మారిన ట్రంప్ ? అద్భుతాలు చేస్తున్నట్లున్న అతని AI ఫోటో షేర్ చేసి సంచలనం..

ఏసుక్రీస్తులా మారిన ట్రంప్ ? అద్భుతాలు చేస్తున్నట్లున్న అతని AI ఫోటో షేర్ చేసి సంచలనం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో XIV మధ్య మాటల యుద్ధం ముదిరింది. పోప్‌ను విమర్శిస్తూనే, ట్రంప్ తనను తాను ఏసుక్రీస్తులా చూపించుకునేలా ఉన్న ఒక AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు  సంచలనంగా మారింది.

ట్రంప్ షేర్ చేసిన ఆ డిజిటల్ ఫోటోలో ఆయన పాతకాలపు వదులైన దుస్తులు ధరించి.. ఒక రోగిపై చేయి పెట్టి అద్భుతం చేస్తున్నట్లు ఉంది. ఆయన వేళ్ల నుండి కాంతి వస్తున్నట్లు, చుట్టూ ఉన్న జనం భక్తితో చూస్తున్నట్లుగా దానిని రూపొందించారు. ఈ ఫోటో చుట్టూ అమెరికా జెండాలు, యుద్ధ విమానాలు, దేవదూతల బొమ్మలు కూడా ఉన్నాయి.

అయితే ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణలపై పోప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ట్రంప్‌కు కోపం తెప్పించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ పోప్ ఒక అభ్యుదయవాది అని, ఆయనకు రాజకీయాలు తెలియవని... పోప్ ఆధ్యాత్మిక విషయాలు చూసుకోవాలి కానీ, దేశ విదేశాంగ విధానాల్లో జోక్యం చేసుకోకూడదని వాదించారు. పోప్ నేరస్తుల పట్ల సానుభూతిగా  ఉంటారని, ఆయన నిర్ణయాలు సరిగ్గా లేవని ఘాటుగా విమర్శించారు.

ట్రంప్ ఇలాంటి ఫోటోలు పెట్టడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అంటే మే 2025లో కూడా తాను పోప్ అవ్వాలనుకుంటున్నట్లు సరదాగా అంటూ, పోప్ వస్త్రధారణలో ఉన్న తన ఫోటోను షేర్ చేశారు. అప్పట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మతపరమైన చిహ్నాలను, దేశభక్తిని కలిపి ట్రంప్ చేస్తున్న ఈ ప్రచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.